అక్క‌డ కాంగ్రెస్ ఇష్ట‌ పూర్వ‌కంగానే సూసైడ్ చేసుకుంది!

Update: 2020-02-13 13:30 GMT
తాము నెగ్గ‌క‌పోయినా ఫర్వాలేదు.. కానీ త‌మ ప్ర‌త్య‌ర్థి చిత్తు అయ్యాడ‌ని ఆనందంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల విష‌యంలో. అక్క‌డ ఫ‌లితాలు ఎలా వ‌చ్చాయో వేరే వివ‌రించ‌న‌క్క‌ర్లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడింది. ఒక్క‌టంటే ఒక్క సీట్లో కూడా కాంగ్రెస్ కు విజ‌యం వ‌రించ‌లేదు. మొత్తం 64 సీట్ల‌కేమో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ.. కేవ‌లం ఒక్కే ఒక్క స్థానంలో మాత్ర‌మే క‌నీసం రెండో స్థానంలో అయినా వ‌చ్చింద‌ట‌!

ప‌దిహేనేళ్ల పాటు తిర‌గులేకుండా ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ అలా రెండో సారి సున్నా సీట్ల‌ కు ప‌రిమితం అయ్యింది. కేవ‌లం ఒక్క స్థానంలో మాత్ర‌మే రెండో స్థానంలో అయినా నిలిచిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంత తిర‌స్క‌ర‌ణ‌ను ఎదుర్కొందో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంత జ‌రిగినా కాంగ్రెస్ పార్టీ వాళ్లు మాత్రం మ‌రీ విషాదంగా ఏమీ లేరు. ఎందుకంటే.. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒకింత ఇష్ట‌పూర్వ‌కంగానే సూసైడ్ చేసుకుంది! అక్క‌డ తాము ఓడినా, త‌మతో పాటు బీజేపీ కూడా చిత్తుకావ‌డం కాంగ్రెస్ కు ఊర‌ట‌ను ఇస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన సంచ‌ల‌న విజ‌యం..కాంగ్రెస్ కు హ్యాపీనెస్ ఇస్తోంది. ఆప్ విజ‌యంలో త‌న విజ‌యాన్ని చూసుకుంటూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే.. బీజేపీ ఓడింది కాబ‌ట్టి!

ఒక‌ప్ప‌టి త‌మ కంచుకోట ను కోల్పోయినా దాన్ని బీజేపీ సొంతం చేసుకోలేదు అనే ఆనందం ఉంది కాంగ్రెస్ కు. ఆ కంచుకోట ఆమ్ ఆద్మీ పార్టీకి ద‌క్కింది కాబ‌ట్టి బీజేపీ ద‌క్క‌లేద‌నే ఆనందం తో కాంగ్రెస్ పార్టీ క‌నిపిస్తోంది. అయితే కొంద‌రు కాంగ్రెస్ నేత‌లే ఈ విష‌యంలో అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. కానీ, ప్ర‌స్తుతానికి కాంగ్రెస్ కు ఈ మాత్రం ఆనందం అయినా ద‌క్కిన‌ట్టే. అలాగే ఈ విష‌యం నుంచి కాంగ్రెస్ గ్ర‌హించాల్సిన మ‌రో అంశం ఏమిటంటే.. బీజేపీ ని ఓడించ‌డం మ‌రీ అసాధ్య‌మైన అంశం కాదు. పోరాడితే సాధించ‌వ‌చ్చు అనే విషయాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకోవాలేమో!
Tags:    

Similar News