ఢిల్లీ సీఎం - ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన చోరీకి గురైన కారు(మారుతీ వ్యాగనార్) దొరికింది. ఇవాళ ఉదయం ఘజియాబాద్ లో ఆ కారును గుర్తించారు.కేజ్రీ కారును ఢిల్లీ పోలీసులకు అందించనున్నట్లు ఘజియాబాద్ పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఢిల్లీ సచివాలయం నుంచి కేజ్రీకి చెందిన బ్లూ వాగన్ ఆర్ కారు చోరీకి గురైంది. ఆ కారును ముద్దుగా ఆప్ మొబైల్ అని పిలుస్తారు. సీఎం కారు చోరీకి గురికావడంతో అదో సంచలనంగా మారింది.
కారు ఎత్తుకెళ్లిన ఘటన తర్వాత సీఎం కేజ్రీవాల్.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. దేశ రాజధానిలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన.. తన లేఖలో గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. నా కారు ఎత్తుకెళ్లడం పెద్ద విషయం కాదు.. కానీ అది ఢిల్లీ సచివాలయం నుంచి దొంగలించడమంటే.. నగరంలో లా అండ్ ఆర్డర్ లేనట్లే అని సీఎం కేజ్రీవాల్ అన్నారు.
కేజ్రీవాల్ తాను సీఎం అయినప్పటికీ ఈ కారునే ఉపయోగిస్తుండేవారు. వీఐపీ సంస్కృతికి వ్యతిరేకంగా ఆయన దీన్ని ఉపయోగించడంతో ఆ కారుకు ప్రజల్లో గుర్తింపు లభించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ, 2014లో పోలీసుల తీరుకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలోనూ ఆయన ఈ కారునే ఉపయోగించారు. ఢిల్లీలో శాంతిభద్రతల నియంత్రణ విషయంలో కేంద్రానికి, ఆయనకు తరుచుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కారు చోరీకి గురికావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే రెండ్రోజుల తర్వాత చోరీకి గురై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కారు దొరికింది.