ఇది ఇండియా అని మరిచిపోయినట్లున్నాడు కేజ్రీవాల్. తాను తీసుకోబోయే నిర్ణయం ఆచరణ సాధ్యమే లేదా అని ఆలోచించకుండా అనుకున్నదే తడవుగా ఓ డెసిషన్ తీసుకుని దిల్లీ ప్రజలకు షాకిచ్చాడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంతకీ ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటయ్యా అంటే.. దిల్లీలో ఇకపై ఒక రోజు సరిసంఖ్య ఉన్న వాహనాలే తిరగాలట. ఇంకో రోజు బేసి సంఖ్య వాహనాలే రోడ్డు మీదికి రావాలట. దిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుండటంతో దాన్ని తగ్గించడానికి కేజ్రీ తీసుకున్న నిర్ణయమిది.
చైనా సహా కొన్ని దేశాల్లో ఈ నిబంధన అమల్లో ఉన్న మాట వాస్తవమే. కానీ చైనాలో ఉన్నది కమ్యూనిస్టు ప్రభుత్వం, పైగా అక్కడ క్రమశిక్షణ ఎక్కువ. కానీ ఇండియా లాంటి దేశంలో ఇలాంటి నిబంధనలు అమలు చేయడం సాధ్యమా? కేజ్రీవాల్ ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ.. ఆచరణ సాధ్యం కాని ఈ నిబంధన తెచ్చి దిల్లీ ప్రజలతో ‘తుగ్లక్’ అనిపించుకుంటున్నాడు ఆప్ అధినేత. కేజ్రీ నిర్ణయంపై సోషల్ మీడియా హీటెక్కిపోయింది. సెటైర్ల మీద సెటైర్లతో రెచ్చిపోయారు జనాలు. ఇక ప్రతి ఇంట్లోనూ రెండు కార్లు, రెండు బైకులు పెట్టుకోవాలని.. ఒకదాన్ని బేసి సంఖ్యతో, ఇంకోదాన్ని సరిసంఖ్యతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఒకరంటే.. కార్లు, బైకుల కంపెనీల సేల్స్ పెంచడానికి కేజ్రీవాల్ పన్నిన కుట్ర ఇదని ఒంకొకరు... అర్రే నా కారుది ప్రైమ్ నంబరే మరి నేనేం చేయాలని ఇంకొకరు.. ఇంతకీ సీఎం గారి కారు నెంబర్ ఏదో అని మరొకరు... ఇలా జోకుల మీద జోకులు పేలుస్తున్నారు జనాలు.
దిల్లీలో విపరీతమైన వాయు కాలుష్యం మూలంగా గ్యాస్ ఛాంబర్లో ఉన్నట్లు బతుకుతున్నామని.. కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేస్తోందని దిల్లీ హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో కేజ్రీవాల్ ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి మరీ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐతే జనాల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎంత వేగంగా ఈ నిర్ణయం తీసుకున్నారో అంతే వేగంగా వెనక్కి తీసుకోక తప్పేలా లేదు.