ఉన్నావ్ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యేనే దోషి

Update: 2019-12-16 11:15 GMT
దిశ ఘటనను మించి దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఉన్నవ్ రేప్ కేసు బాధితురాలి కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ ను యూపీ కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 19న శిక్షను ఖరారు చేస్తామని కోర్టు తెలిపింది. ఈ కేసు విచారణలో జాప్యం చేసిన సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

2017లో ఓ మైనర్ బాలిక ఉద్యోగం కోసం ఉన్నావ్ లోని స్థానిక ఎమ్మెల్యే అయిన కుల్దీప్ సింగ్ సెంగార్ ఇంటికి వెళ్లగా ఆమెపై అత్యాచారం జరిగింది. ఆ తర్వాత బాలికను కిడ్నాప్ చేసిన కొందరు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే బలం, బలగంతో ఆ బాలిక కుటుంబంపై కూడా దాడి చేశారు. తండ్రిని తీవ్రంగా గాయపరిచారు.అక్రమ ఆయుధాల కేసు పెట్టి అరెస్ట్ చేయించారు.బాలిక తండ్రి పోలీస్ కస్టడీలో ఉండగానే మరణించడం కలకలం రేపింది.

తన తండ్రి చావుకు కారణమై.. తనపై అత్యాచారం చేయించిన ఎమ్మెల్యే ఇంటి ముందు బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ వ్యవహారం యూపీతోపాటు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మహిళా సంఘాల ఆందోళనలతో యూపీ అట్టుడికింది.

దీంతో ఈ కేసును సీబీఐకి బదిలీ చేశారు. ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను అరెస్ట్ చేశారు. బీజేపీ నుంచి బహిష్కరించారు. అయినా కూడా బాధితురాలిని ఎమ్మెల్యే అనుచరులు వదల్లేదు. లారీతో ఆమె కారులో ప్రయాణిస్తుండగా ఢీకొట్టించారు. ఈ ఘటనలో బాధితురాలి బంధువులు ఇద్దరు చనిపోయారు. న్యాయవాది బాధితురాలు గాయపడ్డారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎట్టకేలకు దోషిగా ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను కోర్టు తేల్చింది. ఆయనపై 19న శిక్ష విధించనుంది.


Tags:    

Similar News