డీకే కు షాక్... బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Update: 2019-09-25 16:00 GMT
కర్ణాటక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత - మాజీ మంత్రి - పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలతో డీకేను అరెస్ట్ చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రోజుల తరబడి విచారణ జరిపిన తర్వాత ఆయనను తీహార్ జైలుకు తరలించారు. దీంతో ప్రస్తుతం బెయిల్ కోసం తీహార్ జైల్లోనే డీకే ఎదురు చూస్తూ కూర్చున్నారు. బుధవారం తన ఎదురుచూపులకు ఫలితం లభిస్తుందని - తనకు బెయిల్ దక్కుతుందని ఆశించారు. అయితే ఆయనకు షాకిస్తూ... ఈడీ కోర్టు డీకేకు బెయిల్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. వెరసి మరిన్ని రోజుల పాటు డీకే తీహార్ జైల్లోనే కాలం వెళ్లదీయక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

ఇక డీకే బెయిల్ పిటిషన్ పై ఈడీ కోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగానే మారాయని చెప్పాలి. ఏదైనా బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చిన సందర్బంగా ఇటు పిటిషనర్ వాదనతో పాటు ప్రత్యర్థి వర్గానికి చెందిన న్యాయవాది వాదనను విన్న తర్వాత బెయిల్ ఇవ్వలేమని చెప్పే కోర్టు... దానికి కొన్ని కారణాలు కూడా చెబుతుంది. అయితే డీకే విషయంలో మాత్రం కోర్టు కాస్తంత కఠినంగానే వ్యవహరించిందన్న వాదనలు వినిపిస్తున్నారు. డీకేకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ కేవలం సింగిల్ సెంటెన్స్ తోనే తన తీర్పును వెలువరించేశారు. దీంతో డీకే బెయిల్ పిటిషన్ సింగిల్ సెంటెన్స్ తోనే రద్దైపోయిందన్న మాట.

ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణపై కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు డీకేను నాలుగు రోజుల పాటు విచారణ చేసి ఈ నెల 3న అరెస్టు చేశారు. అప్పటి నుంచి 10 రోజులకు పైగా డీకేను విచారించిన అధికారులు న్యాయస్థానం ఆదేశాలతో ఆయన్ను ఢిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు. తాజాగా డీకే బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయనకు బెయిల్ ఇవ్వరాదన్న విషయంపై ఈడీ కోర్టులో తనదైన వాదనను వినిపించింది. డీకేకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతోనే కోర్టు ఆయనకు బెయిల్ ను నిరాకరించింది.


Tags:    

Similar News