ఆప్‌ తో టీఆర్ఎస్ పొత్తు...క్లూ ఇచ్చిన కేజ్రీ స‌న్నిహితుడు

Update: 2017-11-15 14:51 GMT
దేశ రాజ‌కీయాల్లో మ‌రో కొత్త సంకీర్ణ వేదిక పురుడుపోసుకోనుందా? ప‌్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ స‌ర్కారును ఏర్పాటు చేసే ద‌శ నుంచి కేంద్రంలో ఏకపార్టీ ఏలుబ‌డిని తిరిగి తెర‌మీద‌కు తెచ్చిన బీజేపీ ర‌థ‌సార‌థి ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర‌ మోడీకి మ‌రోమారు ప్రాంతీయ పార్టీలే షాక్ ఇవ్వ‌నున్నాయా?  ఇందులో భాగంగా త‌మ త‌మ రాష్ర్టాల్లో బ‌లంగా ఉన్న టీఆర్ఎస్‌ - ఆప్ పార్టీలు వేదిక‌ను స‌న్న‌ద్ధం చేస్తున్నాయా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కీల‌క నేత‌  ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీశ్ సిసోడియా హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించారు. టీఆర్ఎస్ అధినేత  ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్‌తో అసెంబ్లీలో స‌మావేశమ‌య్యారు. అనంత‌రం కేటీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు అయిన టీ హ‌బ్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌నీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది అని కితాబు ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ బాగా పనిచేస్తోందని...ఇంక్యుబేటర్లు - స్టార్ట్ అప్ లను బాగా ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. ఢిల్లీలోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తామ‌ని  తెలంగాణ సహకారం తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో  తెలంగాణ ముందుందని సిసోడియా వివ‌రించారు.

రాజకీయాల్లో ఆప్ - టీఆర్ఎస్ కలిసి పనిచేసే విషయాన్ని భవిష్యత్ నిర్ణయిస్తుందని మ‌నీశ్ సిసోడియా న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్తామని తెలిపారు. మంచి విధానాల్లో పరస్పరం సహకరించుకుంటామ‌ని క్లూ ఇచ్చారు. హైదరాబాద్ వాతావరణం బాగుందని కితాబు ఇస్తూ...ఢిల్లీలో ఆకాశాన్ని చూసే అవకాశం లేదని ఇక్కడ ఆ అవకాశం కలిగిందని చ‌మ‌త్క‌రించారు. కాగా, ఢిల్లీ ఉప ముఖ్య‌మంత్రి, ఆప్ నేత వ్యాఖ్య‌లు కొత్త పొత్తుల‌కు వేదిక‌గా ఉన్నాయ‌నే చ‌ర్చ సాగుతోంది.
Tags:    

Similar News