మద్యం అమ్మకాలపై ‘కేజ్రీ’ మార్క్ పన్ను బాదుడు..!

Update: 2020-05-05 04:32 GMT
కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. మద్యం అమ్మకాల్ని నిషేధించటం తెలిసిందే. దాదాపు ఆరేడు వారాల తర్వాత దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు సోమవారం నుంచి షురూ అయ్యాయి. అందరూ ఊహించినట్లే.. మద్యం కొనుగోళ్ల కోసం మందుబాబులు భారీ ఎత్తున ఎగబడ్డారు. కిలోమీటర్ల కొద్దీ క్యూలు దర్శనమిచ్చాయి. లాక్ డౌన్ తో వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిన నేపథ్యం లో రోజువారీ జీవితానికి ఇబ్బందులు పడుతున్నారన్న వాదనకు భిన్నంగా లిక్కర్ షాపుల దగ్గర జనసందోహం దిమ్మ తిరిగేలా చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ రాష్ట్రంలో మద్యం అమ్మకాల్ని షురూ చేసిన ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మద్యం అమ్మకాలపై భారీ పన్ను విధిస్తూ షాకిచ్చింది. మే ఐదు నుంచి దేశ రాజధానిలో మద్యం అమ్మకాలపై 70 శాతం పన్ను విధించనున్నట్లు స్పష్టం చేసింది. సోమవారం రాత్రి దీనికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ రాష్ట్రంలో మద్యం దుకాణాల్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు తెరిచి ఉండేలా కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ పై తాజాగా విధించిన 70 శాతం పన్నుకు కరోనా స్పెషల్ పన్నుగా పేర్కొంది. మద్యం కోసం మందుబాబులు తపిస్తున్న వైనం చూసినప్పుడు 70 శాతం కాదు వంద శాతం పన్ను వేసినా.. వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వారి తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. మందు కోసం సామాజిక దూరాన్ని పాటించకుండా ఎగబడిన వైనం చూస్తే.. మందు ముందు కరోనా భయమే లేదని చెప్పక తప్పదు.
Tags:    

Similar News