ఆ పిల్ల పిశాచిని వ‌దిలేస్తార‌ట‌!

Update: 2015-12-18 12:49 GMT
స‌రిగ్గా మూడేళ్ల క్రితం దేశ రాజ‌ధానిలో క‌దులుతున్న బ‌స్సులో పారామెడిక‌ల్ విద్యార్థిని జ్యోతిసింగ్ (నిర్భ‌య‌)ను అత్యంత పాశ‌వికంగా.. సామూహిక అత్యాచారం చేసి.. తీవ్రంగా గాయ‌ప‌రిచి.. బ‌స్సులో నుంచి ప‌డేయ‌టం తెలిసిందే. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసులో దోషులుగా నిరూపిత‌మైన వారిలో ఒక బాల నేర‌స్తుడు (నేరం జ‌రిగే నాటికి మైన‌ర్‌) ఉండ‌టం.. అతనికి మూడేళ్లు జైలుశిక్ష‌ను విధించారు.

అయితే.. అత‌డిని జువైన‌ల్ హోం నుంచి విడుద‌ల చేయ‌టాన్ని నిలిపివేయాలంటూ జ్యోతిసింగ్ త‌ల్లిదండ్రులు కొద్దిరోజులుగా ఆందోళ‌న చేస్తున్నారు. త‌మ కుమార్తెను దారుణంగా అత్యాచారం చేసి.. ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన జువైన‌ల్ నేర‌స్తుడి విడుద‌ల‌న‌ను ఆపేయాల‌ని వారు కోరుతున్నారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆ బాల‌నేర‌స్తుడిని ఈ నెల 20న విడుద‌ల చేయాల్సి ఉంది. ఈనేప‌థ్యంలో అత‌డి విడుద‌ల‌పై స్టే విధించాల‌ని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఈ కేసుపై విచార‌ణ జ‌రిపిన ఢిల్లీ హైకోర్టు.. చ‌ట్ట‌ప్ర‌కారం అత‌డి విడుద‌ల‌ను ఆపివేయ‌లేమని స్ప‌ష్టం చేసింది. దీంతో.. పిల్ల పిశాచిగా పేర్కొనే అత‌గాడు ఈ నెల 20న విడుద‌ల‌య్యే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు చెబుతున్నారు. నేరం చేసిన తీవ్ర‌త‌ను చూడాలే కానీ.. వ‌య‌సును కాద‌న్న వాద‌న మ‌రోసారి జోరందుకుంది.
Tags:    

Similar News