మ‌గ తోడు ఉంటేనే రండి... మ‌హిళ‌ల‌కు జుమా మ‌సీదు సంచ‌ల‌న ఆదేశం

Update: 2022-11-25 03:31 GMT
దేశ రాజధాని ఢిల్లీలోని ప్ర‌పంచ‌ ప్రఖ్యాత జమా మసీదు సంచ‌ల‌న‌ నిర్ణయం తీసుకుంది. మసీదులోకి పురుషుడు తోడులేని ఒంటరి మహిళల ప్రవేశంపై నిషేధం విధించింది. ఒంటరి స్త్రీ అయినా లేదా మహిళల బృందమైనా మగవాళ్లు వెంట లేకుండా అనుమతించబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు జమా మసీద్ మాస్క్ మేనేజ్‌మెంట్ కమిటీ  నిర్ణయం తీసుకుంది.

మసీద్ ప్రాంగణంలోకి ప్రవేశించాలనుకునే మహిళలు వారి కుటుంబంలోని పురుషులను వెంటబెట్టుకుని రావాలని తెలిపింది. ఈ మేరకు మసీద్ ఎంట్రన్స్ గేట్ల వద్ద నోటీస్ అంటించారు. అంతేకాదు.. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ముస్లింల‌కు సందేశం పంపించారు.

ఇక‌, ఈ విష‌యంపై తీవ్ర వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో.. జమా మసీద్ కమిటీ నిర్ణయాన్ని మసీద్ పీఆర్‌వో సబివుల్లా ఖాన్ సమర్థించారు. ప్రార్థనల కోసం వచ్చినవారికి ఇబ్బంది కలిగించేలా సోషల్ మీడియా కోసం మహిళలు వీడియోలు షూట్ చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కుటుంబాలు లేదా దంపతులపై ఎలాంటి నిషేధంలేదని స్పష్టం చేశారు.

మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్‌..

జుమా మ‌సీదు ఆదేశాలు, త‌ర్వాత జ‌రుగుతున్న‌ పరిణామాల‌పై ఢిల్లీలోని కమిషన్ ఫర్ ఉమెన్  స్పందించింది. ఈ అంశంపై జమా మసీద్ పాలనా యంత్రాంగానికి నోటీసు జారీ చేయనున్నామని ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమెన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఆమె స్పందించారు.

ఈ తరహా నిషేధం విధించేందుకు ఎవరికీ హక్కులులేవని తప్పుబట్టారు. మ‌హిళ‌ల వెంట పురుషులు ఉండాల‌నే సిద్ధాంతం ఎవ‌రు తీసుకువ‌స్తున్నారో చెప్పాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ఇక‌, ఇది.. ఎలాంటి మ‌లుపు తిరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News