ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. తెలంగాణలో కీల‌క వ్య‌క్తిని అరెస్ట్ చేసిన సీబీఐ!

Update: 2022-10-10 06:32 GMT
ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ద‌ర్యాప్తును సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌ (సీబీఐ) వేగవంతం చేసింది. గతకొన్ని రోజులుగా పలువురిని విచారించిన సీబీఐ.. తాజాగా తెలంగాణ‌కు చెందిన కీల‌క వ్య‌క్తిని అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం ప్ర‌క‌ట‌న జారీ చేసింది.

ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌ చేశామని.. ఆయన్ను కోర్టులో హాజరుపరుస్తామని సీబీఐ వెల్ల‌డించింది. దీంతో ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంకు సంబంధించి ఇప్పటివరకు సీబీఐ అరెస్ట్‌ చేసిన వారి సంఖ్య రెండుకు చేరుకుంది. అభిషేక్ బోయిన‌ప‌ల్లికి ముందు విజయ్‌ నాయర్‌ను సీబీఐ అరెస్ట్‌ చేసిన సంగ‌తి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సైతం సమీర్‌ మహేంద్ర అనే వ్యక్తిని ఇప్ప‌టికే అరెస్టు చేసింది.

కాగా ఢిల్లీకి చెందిన జిఎన్‌సిటిడి ఎక్సైజ్ పాలసీని రూపొందించి, అమలు చేయడంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కొనసాగుతున్న కేసు దర్యాప్తులో భాగంగా అభిషేక్ బోయిన్‌పల్లిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్ల‌డించింది.

హైద‌రాబాద్‌కు చెందిన అభిషేక్ బోయిన‌ప‌ల్లి పెద్ద వ్యాపారి అని సీబీఐ తెలిపింది. తాము ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణాన్ని విచార‌ణ చేస్తున్న స‌మయంలో ఆయ‌న పేరు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది. దీంతో ఆయ‌న‌ను విచార‌ణకు ర‌మ్మ‌ని పిలిచామ‌ని సీబీఐ వివ‌రించింది. అయితే ఆయ‌న సీబీఐని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశాడ‌ని ఆరోపించింది. అంతేకాకుండా త‌మ విచార‌ణ‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌ని పేర్కొంది. దీంతో అత‌డిని అరెస్టు చేయ‌క త‌ప్ప‌లేద‌ని సీబీఐ వివ‌రించింది.

కాగా ఢిల్లీ మ‌ధ్యం కుంభ‌కోణంలో అరెస్టు చేసిన నిందితులను ఢిల్లీలోని రోస్ అవెన్యూ కోర్టులో హాజరు పరచనున్నారు. రెండు వారాల కస్టోడియల్ రిమాండ్‌కు వీరిని అప్ప‌గించాల‌ని న్యాయ‌స్థానాన్ని సీబీఐ కోర‌నుంది.

ఇప్ప‌టివ‌ర‌కు మ‌ద్యం కుంభ‌కోణంలో సీబీఐ ఇద్ద‌రు.. ఢిల్లీ వ్యాపార‌వేత్త‌ విజ‌య్ నాయ‌ర్‌, తెలంగాణ వ్యాపార‌వేత్త అభిషేక్ బోయిన‌ప‌ల్లిని అరెస్టు చేసింది. ఇక ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ నాయ‌ర్ స‌హ‌చ‌రుడిగా ఉన్న స‌మీర్ మ‌హేంద్ర‌న్ ను అరెస్టు చేసింది. దీంతో ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో మొత్తం అరెస్టులు ప్ర‌స్తుతానికి మూడుకు చేరాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News