కేసీఆర్.. అర్జెంట్ గా ఈ సంగతిని చూడండి

Update: 2015-12-04 11:06 GMT
అవకాశాలు అన్నిసార్లు రావు. ఒక్కోసారి అనుకోకుండా వస్తాయి. అలాంటి వాటిని అందిపుచ్చుకుంటే అనుకోని ఫలితాలు రావటం ఖాయం. తాజాగా ఢిల్లీ రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న విధానం హైదరాబాదీయుల మనసుల్ని దోచుకోవటమే కాదు.. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెప లాడేలా చేయాలన్న ఆకాంక్ష తీరటం ఖాయమని చెబుతున్నారు.

గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా చూపించేందుకు.. ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతల్ని పార్టీలోకి తీసుకోవటంతో పాటు.. ప్రజల మనసుల్ని దోచుకోవటానికి ఇంటిపన్ను మొదలు.. కుళాయి పన్ను వరకూ చాలానే వరాలు ప్రకటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. వీటి సంగతి ఎలా ఉన్నా.. నగర జీవికి సాంత్వన కలిగించే కొన్ని అంశాల మీద దృష్టి పెట్టి..యుద్ధ ప్రాతిపదికన పరిష్కరం వెతికితే నగరవాసుల మనసుల్ని దోచుకోవటం ఖాయమని చెప్పొచ్చు. ఇటీవల ఢిల్లీ రాష్ట్ర సర్కారు ఒక వినూత్న విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఢిల్లీలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు.. ఇష్టారాజ్యంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వారికి చెక్ చెప్పేందుకు వీలుగా ఒక యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 ఈ యాప్ ను ఉపయోగించి వాహనదారులు చేసే ట్రాఫిక్ ఉల్లంఘనల్ని  ఫోటోలు కానీ వీడియోలు కానీ అప్ లోడ్ చేయొచ్చు దీని ఆధారంగా అధికారులు సమాచారం ఇచ్చే వారికి పాయింట్లు ఇవ్వటం మొదలు పెడతారు. ఇలా పాయింట్లు కలిపి కారు మొదలు విమానం టిక్కెట్ల వరకూ చాలానే బహుమతులు అందిస్తారు. ఇక.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదట్లో కాస్త  ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించగలిగితే.. స్వల్ప వ్యవధిలోనూ హైదరాబాద్ ను వెంటాడి వేధించే ట్రాఫిక్ సమస్యలు తీరటంతో పాటు.. ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. నిత్యం తమపై ఎవరో ఒకరి నజర్ ఉంటుందని అర్థమైనప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవటం ఖాయం. అదే జరిగితే.. ట్రాఫిక్ కష్టాలతో దశాబ్దాల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సగటు హైదరాబాదీకి ఆ పరిష్కారం ఇస్తే అంతకన్నా ఏం కావాలి. హైదరాబాదీల మనసు దోచుకునే ఛాన్స్ ను కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News