మోడీ డిగ్రీపై తాజా ర‌చ్చ ఇదే

Update: 2018-03-02 05:25 GMT
ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హ‌త విష‌యంలో నెల‌కొన్న వివాదం మ‌రోమ‌లుపు తిరిగింది. సమాచార కార్యకర్తలు అంజలీ భరద్వాజ్‌ - నికిల్‌ డే - అమృత జోహ్రిలు.. ప్రధాని మోడీ డిగ్రీ వివరాలను తెలపాలని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ)ను గ‌తంలో కోరిన సంగ‌తి తెలిసిందే. దీంతో వివరాలు అందించాలని ఢిల్లీ యూనివర్సిటీకి సీఐసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల అఫిడవిట్‌ లో మోడీ దాఖలు చేసిన వివరాలు (1978వ బ్యాచ్‌ బీ.ఏ డిగ్రీ) పరిశీలించడానికి అనుమతినివ్వాలని యూనివర్సిటీని సీఐసీ కోరింది. అయితే దీనికి యూనివర్సిటీ అంగీకరించలేదు.

 ప్రధాని మోడీ డిగ్రీని బహిర్గతం చేయలేమని ఢిల్లీ హైకోర్టుకు ఢిల్లీ యూనివర్సిటీ గురువారం తెలిపింది. మోడీ డిగ్రీ వివరాలు తెలపాలని 2016లో సమాచార హక్కు చట్టం ద్వారా నమోదైన పిటిషన్‌ కు సమాధానమిస్తూ... తమకున్న పరిమితుల దృష్ట్యా విద్యార్థుల సమాచారాన్ని బహిర్గతం చేయలేమని కోర్టుకు స్పష్టం చేసింది. తమకు విద్యార్థులతో 'విశ్వసనీయ బంధం' ఉందని.. వారి డిగ్రీలకు సంబంధించిన విషయాలను తెలపబోమని చెప్పింది. పిటిషనర్లు స్వార్థ ప్రయోజనాలను ఆశించి కోరుతున్నారని ఆరోపించింది.  సీఐసీ ఉత్తర్వులను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్‌ వేసింది. దీంతో కోర్టు దీనిపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీయే ఆ వివరాలు బయటపెట్టాలని ఈ యేడాది జనవరిలో తెలిపింది. కోర్టు నిర్ణయంపట్ల సమాచార కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు తెలియాల్సిన విషయమని.. ఇలా చేస్తే సమాచార శాఖను నియంత్రించినట్టే అవుతుందని వాపోయారు. త‌మ ప్ర‌య‌త్నం కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

కాగా - న‌ల్సార్  లా యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్‌ - కేంద్ర స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ మోడీ విద్యార్హ‌త‌ల విష‌యంలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ డిగ్రీ విద్యార్హ‌త‌ల‌పై నెల‌కొన్న సందేహాల‌ను నివృత్తి చేసుకునేందుకు ఆయ‌న ధ్రువ‌ప‌త్రాల‌ను ప‌రిశీలించేందుకు అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ విధుల్లో నుంచి మాన‌వ వ‌న‌రుల విభాగం బాధ్య‌త‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం తొల‌గించింది.
Tags:    

Similar News