మంచుకొండ‌ల్లో మ‌మ‌త మంట‌లు

Update: 2017-06-16 07:40 GMT
భావోద్వేగ అంశాల మీద నిర్ణయాలు తీసుకునేట‌ప్పుడు చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఏ మాత్రం తేడా వ‌చ్చినా మొద‌టికే మోసం వ‌స్తుంది. అందునా రాజ‌కీయంగా అంటే.. ఆ ప్ర‌మాదం మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల విష‌యంలో స‌మైక్య పాల‌కుల త‌ప్పులు చివ‌ర‌కు ఏపీ రెండు ముక్క‌లు కావాల్సి వ‌చ్చింద‌న్న విష‌యాన్ని దేశంలోని మిగిలిన రాష్ట్రాల పాల‌కులు నేటికీ గుర్తించ‌లేద‌న్న విష‌యం డార్జిలింగ్ లో చోటు చేసుకున్న వైనాన్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ప‌శ్చిమబెంగాల్ లో భాగ‌మైన గూర్ఖాలాండ్‌ ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాల‌న్న డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉన్న‌దే. దీనిపై ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఉద్య‌మాలు జ‌రిగాయి. వాటిని అక్క‌డి ప్ర‌భుత్వం త‌న బ‌లంతో అణిచివేస్తోంది. ఇలాంటి వేళ‌.. తాజాగా ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వివాదాస్ప‌ద నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. బెంగాలీ భాషా బోధ‌న త‌ప్ప‌నిస‌రి అంటూ ఆమె తీసుకున్న నిర్ణ‌యం మంచు కొండ‌ల్లో మంట‌ల్ని రేపుతోంది. గుర్ఖాలాండ్ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి ఊపిరి పోసేలా చేసింది.

తాజా ఆందోళ‌న‌లు ఎక్క‌డి వ‌ర‌కూ వెళ్లాయంటే ఆందోళ‌న‌కారుల మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేయ‌టం.. టియ‌ర్ గ్యాస్ ప్ర‌యోగించ‌టం వ‌ర‌కూ వెళ్లాయి. ఆందోళ‌న‌కారులు సైతం త‌మ నిర‌స‌న‌ల్ని అంత‌కంత‌కూ పెంచుకుపోతున్నారు. ఒక్క గురువారం చోటు చేసుకున్న ప‌రిణామాలు చూస్తే.. ఒక పోలీస్ ఔట్ పోస్ట్ ను.. మ‌రో సెరిక‌ల్చ‌ర్ కార్యాల‌యాన్ని.. మ‌రో రైల్వే స్టేష‌న్‌ ను.. ఒక మీడియా వాహ‌నానికి నిప్పు పెట్టే వ‌ర‌కూ వెళ్లారు.

ఇదిలా ఉంటే.. గూర్ఖాజ‌న‌ముక్తి మోర్చా అధినేత బిమ‌ల్ గురుంగ్ అండ‌ర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. మ‌రోవైపు జీజేఎం కార్యాల‌యంలోనూ.. దాని అధినేత గురుంగ్ నివాసం మీదా పోలీసులు జ‌రిపిన త‌నిఖీల్లో పెద్ద ఎత్తున ఆయుధాల్ని స్వాధీనం చేసుకున్నారు. నిర‌స‌న‌ల్లో భాగంగా ఆందోళ‌న‌కారులు త‌మ‌పై బాంబులు విసిరిన‌ట్లుగా పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప్ర‌త్యేక గూర్ఖాలాండ్ ఉద్య‌మం కోసం జీజేఎం నిర్వ‌హిస్తున్న ఉద్య‌మం హింసాత్మ‌కంగా మార‌టంతో మ‌మ‌తా బెన‌ర్జీ స‌ర్కారుకు ఇప్పుడు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. డార్జిలింగ్ కొండ ప్రాంతాల్ని ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టించాల‌న్న డిమాండ్ తో తాజాగా చేప‌ట్టిన నిర‌వ‌ధిక బంద్ నాలుగో రోజుకు చేరుకుంది. ఉద్య‌మానికి నేతృత్వం వ‌హిస్తున్ననేత‌ల నివాసాల మీదా.. వారి కార్యాల‌యాల్లో నిర్వ‌హిస్తున్న త‌నిఖీల్లో పెద్ద ఎత్తున ఆయుధాల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిల్లో బాణాల‌తో పాటు పేలుడు ప‌దార్ధాలు కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఇదిలా ఉంటే.. పోలీసులు చెబుతున్న‌ట్లుగా పేలుడు ప‌దార్థాలు త‌మ ద‌గ్గ‌ర ఉండ‌టం లేద‌ని అక్క‌డి వారు చెబుతున్నారు. అయుధాల‌న్నీ సంప్ర‌దాయంగా త‌మ ఇళ్ల‌ల్లో ఉండేవ‌ని డార్జిలింగ్ వాసులు వాదిస్తున్నారు. పోలీసుల వైఖ‌రిపై స్థానికంగా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ తాజా ప‌రిణామాల‌పై స్పందిస్తూ.. కొంద‌రి నేత‌ల గూండాగిరిని స‌హించే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు. డార్జిలింగ్‌ లో శాంతిని నెల‌కొల్పాల‌ని తాము భావిస్తున్నామ‌ని.. బెంగాల్‌ను శాంతియుతంగా ఉంచ‌ట‌మే త‌మ ల‌క్ష్యంగా చెబుతున్నారు. హింస‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తామ‌ని ఆమె హెచ్చ‌రిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజా ప‌రిణామాల‌పై తృణ‌మూల్ తో జ‌ట్టు క‌ట్టిన గూర్ఖా నేష‌న‌ల్ లిబ‌రేష‌న్ ఫ్రంట్ అధికార పార్టీతో త‌మ‌కున్న అనుబంధాన్ని తెంచేసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

 ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఊహించ‌ని రీతిలో డార్జిలింగ్ కొండ‌ల్లో మొద‌లైన ఆందోళ‌న‌లు విదేశీ ప‌ర్యాట‌కుల‌కు పెను ఇబ్బందిగా మారాయి. అక్క‌డి ఆందోళ‌న నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు బంద్‌ కు పిలుపును ఇవ్వ‌టంతో పెద్ద పెద్ద హోట‌ళ్లు మూత‌ప‌డ్డాయి. స్థానికంగా చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి అవ‌గాహ‌న లేని విదేశీయులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. భోజ‌నం చేయ‌కుండా ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు వెళ్లి తిరిగి వ‌చ్చిన వారికి భోజ‌నం లేక‌పోవటంతో వారు ఆక‌లితో అల్లాడిపోతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో డార్జిలింగ్ కు వెళ్లే ప‌ర్యాట‌కులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News