ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ కూల్చివేత.. నరసన్నపేటలో ఉద్రిక్తత

Update: 2022-03-27 11:51 GMT
టీడీపీ నేతల పేర్లు, వారి పేరిట ఉన్న వాటిని నామరూపాల్లేకుండా చేయాలని వైసీపీ సర్కార్ కంకణం కట్టుకున్నట్టు ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కడపలో ‘అన్న క్యాంటీన్ కూల్చివేత’ మరవక ముందే తాజాగా మరోసారి అలాంటి ఘటనే చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్మాణదశలో ఉన్న ఎర్రన్నాయుడు చిల్డ్రన్ పార్క్ ను కూల్చివేయడం కలకలం సృష్టించింది.

గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరైన  ఈ పార్క్ స్థలంపై కొందరు కన్నేసి శనివారం వేకువజామున జేసీబీలతో పడగొట్టారు. నిర్మాణ దశలో ఉన్న పార్క్ ప్రహరీ, రీడింగ్ రూం, గడులను కూల్చేశారు. అంతర్గత రహదారులను పడగొట్టారు. విద్యుత్ తీగలను తొలగించారు.

విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వెళ్లిన టీడీపీ కార్యకర్తలపై కూల్చివేత చేపట్టిన వారు దాడి చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఆందోళన చేపట్టారు. పార్క్ నిర్మాణానికి అప్పటి కలెక్టర్ అనుమతులు మంజూరు చేశారు.

పార్క్ నిర్మాణానికి దాదాపు 2 కోట్ల  రూపాయల వ్యయం అవుతుందని భావించారు. నరసన్నపేట గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.34.50 లక్షలు విడుదల కావడంతో పనులు ప్రారంభించారు. కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందిన ఈ స్థలం తమకే మంజూరైందంటూ 15మంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇప్పటివరకూ పార్క్ నిర్మాణం పూర్తికాలేదు.

వైసీపీ పాలనలో పార్కులకూ రక్షణ లేకుండా పోయిందని టీడీపీ మాజీ ఎమమ్ెల్యే రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నపిల్లల పార్కుపై పెద్దల కళ్లు పడ్డాయని ఆరోపించారు.ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దోషులను అరెస్ట్ చేసి ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలని కోరారు.
Tags:    

Similar News