మోడీ చలవతో మున్సిపాలిటీలు బతికిపోయాయి..

Update: 2016-11-23 10:08 GMT
కొన్నాళ్లుగా దేశంలోని మున్సిపాలిటీల్లో 90 శాతం ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా సతమతమవుతున్నాయి. చివరకు రోడ్ల మీద గుంతలు పూడ్చడానికి కూడా నిధుల్లేక జనంతో తిట్లు తింటున్నారు స్థానిక పాలకులు. అంతేకాదు.. జీతాలు ఇవ్వడానికి ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నాయి. అలాంటి నగరాలు - మున్సిపాలిటీలన్నిటి ఆర్థిక పరిస్థితి గత రెండు వారాల్లో ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దుతో అవన్నీ భారీగా లబ్ది పొందాయి.  మున్సిపాలిటీల్లో పన్ను చెల్లింపులు ఒక్కసారిగా పెరిగాయి.

దేశంలోని 47 మున్సిపాలిటీల్లో గత సంవత్సరంతో పోల్చితే పన్నుల ఆదాయం దాదాపు రెట్టింపయింది. ఒక్క హైదరాబాద్‌ లోనే నవంబర్ 22నాటికి 208 కోట్ల పన్ను చెల్లింపులు జరిగాయంటే జీహెచ్‌ ఎంసీకి ఏ రేంజ్‌ లో ఆదాయం సమకూరిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నాళ్లు పన్ను కట్టాలంటూ ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోని బడా బాబులు నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించగానే కోట్ల రూపాయలను మున్సిపాలిటీలకు చెల్లించేందుకు సిద్ధపడ్డారు. రద్దయిన నోట్లతో పన్నులు కట్టే ఛాన్సివ్వడంతో బకాయిలన్నీ తీర్చేస్తున్నారు.

జీహెచ్‌ ఎంసీకి నవంబర్ 2015లో 8 కోట్ల రూపాయల పన్ను చెల్లింపుల ద్వారా ఆదాయం సమకూరగా - నవంబర్ 22 తేదీ నాటికి 208 కోట్ల రూపాయల ట్యాక్స్‌ చెల్లింపులు జరిగాయి. ముంబై  పరిధిలో గత సంవత్సరం 3,185 కోట్ల చెల్లింపులు జరగ్గా, ఈ సంవత్సరం 11,913 కోట్ల ఆదాయం పన్నుల ద్వారా సమకూరింది. సూరత్‌ లో గత సంవత్సరం 7.19 కోట్లు - నోట్ల రద్దు తర్వాత 100 కోట్లు - అహ్మదాబాద్‌ లో 2015 నవంబర్‌ లో 78 కోట్ల పన్ను చెల్లింపులు జరగ్గా, 2016 నవంబర్‌లో 170 కోట్లు పన్నుల ద్వారా అహ్మదాబాద్ మున్సిపాలిటీ ఆదాయాన్ని గడించింది. కల్యాణ్ మున్సిపాలిటీ గత సంవత్సరం 120 కోట్లు - ఈ నవంబర్‌ లో 170 కోట్ల రూపాయలను పన్ను రూపంలో చెల్లించారు. ఈ ఐదు మున్సిపాలిటీలతో పాటు మరో 44 మున్సిపాలిటీల మొత్తం ఆదాయం అక్షరాల 13, 192 కోట్లు. చిన్న మున్సిపాలిటీలు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్కెక్కాయి. మొత్తానికి ఇంతకాలం పోగయిన నల్లధనం ఇప్పుడు ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కొంతవరకు వచ్చి చేరుతుండడం శుభపరిణామమే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News