బొత్స‌కు స‌వాలు విసురుతున్న విద్యాశాఖ !

Update: 2022-06-07 05:29 GMT
విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స స‌త్యనారాయ‌ణ ప‌లు సవాళ్లు చ‌వి చూస్తున్నారు. లేదా ఎదుర్కొంటున్నారు. వీలున్నంత వ‌ర‌కూ శాఖ‌ను గాడిలో పెట్టేందుకు బొత్స ప్ర‌య‌త్నించినా ఫ‌లితాలు రావ‌డం లేదు అన్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. తాజాగా ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు అర‌వై ఏడు శాతానికి మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం, గ‌డిచిన ఇర‌వై ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా ఫ‌లితాలు దారుణంగా ప‌డిపోవ‌డం దృష్ట్యా బొత్స నిరాశ‌లో ఉన్నారు.

నిస్పృహ‌లో ఉన్నారు. ఏం చేయాలో తోచ‌క ఇబ్బంది ప‌డుతున్నారు. త‌న‌కు ఈ శాఖ వ‌ద్ద‌ని ముందు నుంచి ఆయ‌న చెబుతూనే ఉన్నారు. త‌నకు మొద‌ట కేటాయించిన మున్సిప‌ల్ శాఖ‌నే మ‌ళ్లీ  కేటాయిస్తే బాగుంటుంద‌ని కూడా ఆయ‌న సీఎంఓకు విజ్ఞ‌ప్తి చేశారు. కానీ సీఎం ఆ మొర‌ను విన‌లేదు. త‌ప్ప‌నిసరిగా చేయాల్సిందే అని అప్ప‌టిదాకా ఆయ‌న నిర్వ‌ర్తిస్తున్న శాఖ‌ను ఆదిమూలపు సురేశ్ కు అప్ప‌గించి, బొత్స‌కు ఓ విధంగా ఝ‌ల‌క్ ఇచ్చారు జ‌గ‌న్.

తాజా ప‌రిణామాలు, అంత‌కుముంద‌రి ప‌రిణామాలు ప‌రిగ‌ణించి చూస్తే ఈ సారి ప‌దో త‌ర‌గతి ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణే పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ప్ర‌శ్న‌ప‌త్రాలు లీక్ అయ్యాయ‌ని ఓ సారి, మాస్ కాపీయింగ్ జ‌రుగుతుంద‌ని మ‌రోసారి, లేదు లేదు అవేవీ నిజాలు కాదు అబ‌ద్ధాలే అని ప్ర‌క‌ట‌న‌లు ఇంకోసారి ఈవిధంగా ఎన్న‌డూ లేనంత‌గా రాష్ట్రంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఆఖ‌రికి మాజీ మంత్రి నారాయ‌ణ‌ను కూడా ఇవే ఆరోప‌ణ‌ల‌పై అరెస్టు చేశారు కూడా !

కొంద‌రు ఉపాధ్యాయుల‌ను కూడా ఇదే కోవ‌లో జైలు బాట ప‌ట్టించారు కూడా ! అయినా ఆ ఆరోప‌ణ‌ల క‌థేంటో ఇప్ప‌టిదాకా తేల‌లేదు. వాటి సంగ‌తి అటుంచితే ఫ‌లితాల విడుద‌ల్లోనూ చిన్న పాటి ఉద్విగ్న లేదా ఉత్కంఠ వాతావ‌ర‌ణం నెల‌కొంది. శ‌నివారం విడుద‌ల కావాల్సిన ఫ‌లితాలు కాస్త సోమ‌వారం విడుద‌ల‌య్యాయి.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా మార్కుల న‌మోదులోనూ సాంకేతిక లోపాలు ఉన్నాయి. కొంద‌రికి మ్యాథ్స్ లో 17 మార్కులు వ‌చ్చినా పాస్ అని చెప్పిన దాఖ‌లాలు, ఆ విధంగా న‌మోద‌యిన దాఖ‌లాలు ఉన్నాయి. వాటి ఆధారాలు కూడా సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. వీట‌న్నింటిని దృష్టిలో ఉంచుకుని ఇంట‌ర్ ఫ‌లితాలు ఏ విధంగా ఉండ‌బోతున్నాయో అన్న ఉత్కంఠ ఒక‌టి రాష్ట్ర వ్యాప్తంగా నెల‌కొని ఉంది.

పదో త‌ర‌గ‌తి క‌న్నా ఇంట‌ర్ చాలా కీల‌కం. సాంకేతిక విద్య‌కు అక్క‌డ వ‌చ్చే మార్కులు కొన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు, కొన్ని కాలేజీల అడ్మిష‌న్ల‌కు ప్రామాణికం. కొన్ని జాతీయ స్థాయి విద్యాసంస్థ‌లు నిర్వ‌హించే  ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ఇంట‌ర్ మార్కుల‌ను కీల‌కంగా ప‌రిగ‌ణించిన దాఖ‌లాలు ఉన్నాయి. ఈ త‌రుణాన మంత్రి బొత్స‌పై ఇప్పుడు గురుత‌ర బాధ్య‌త‌లు ఉన్నాయి.
Tags:    

Similar News