జ‌గ‌న్ గుర్తు సైకిల‌న్న మ‌హిళ.. వ‌లంటీర్‌ను స‌స్పెండ్ చేయాల‌న్న డిప్యూటీ సీఎం!

Update: 2022-07-30 11:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌లంటీర్ వ్య‌వ‌స్థ త‌న మాన‌స పుత్రిక అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప‌లుమార్లు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అధికారంలోకి రాగానే 2.8 ల‌క్ష‌ల మంది వ‌లంటీర్ల‌ను నియ‌మించారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను డోర్ డెలివ‌రీ చేయ‌డానికి ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక‌రు చొప్పున వలంటీర్ల‌ను నియ‌మించారు. వీరికి నెల‌కు రూ.5000 జీతంగా ఇస్తున్నారు. అయితే ఏ ప్ర‌భుత్వ ప‌థ‌కం అంద‌క‌పోయినా దానికి ప్ర‌జ‌లు వ‌లంటీర్ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు.

త‌మ‌కే సంబంధం ఉండ‌ద‌ని.. ఉన్న‌త స్థాయి నుంచే ప‌థ‌కం ల‌బ్ధిదారుల జాబితా ఆమోద ముద్ర పొంది వ‌స్తుంద‌ని చెబుతున్నా విన‌డం లేదు. ఇక అధికార పార్టీ నేత‌లు సంద‌ర్భ‌మొచ్చిన ప్ర‌తిసారి త‌మ ఫ్ర‌స్టేష‌న్ ను, కోపాన్ని వ‌లంటీర్ల మీద చూపుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్తూరు జిల్లా గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం క‌ళ‌త్తూరు నారాయ‌ణ స్వామి కూడా తాజాగా ఒక వలంటీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇటీవ‌ల గంగాధ‌ర నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలోని ముష్టిపల్లి గ్రామంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గడప గడపకూ మ‌న ప్ర‌భుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సుబ్బమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం వ‌ల్ల క‌లిగిన ల‌బ్ధినంతా చ‌దివి వినిపించారు. అంతేకాకుండా ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ వల్లే ఆమెకు ఇంత నగదు లబ్ధి చేకూరిందని డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి చెప్పారు.

మ‌రి మీరు ఇంత ప‌నిచేస్తున్న వైఎస్ జగన్ పార్టీ గుర్తు ఏంటని సుబ్బ‌మ్మ‌ను నారాయ‌ణ‌స్వామి ప్ర‌శ్నించారు. దీంతో ఆ మ‌హిళ సైకిల్ అని చెప్పింది. దీంతో నారాయ‌ణ‌స్వామికి చిర్రెత్తుకొచ్చిందని స‌మాచారం. సైకిల్ గుర్తు టీడీపీది కావ‌డ‌మే ఇందుకు కార‌ణం.  

దీంతో తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ డిప్యూటీ సీఎం నారాయ‌ణ‌స్వామి వెంటనే వ‌లంటీర్‌ను సస్పెండ్‌ చేయాలని ఎంపీడీవోను ఆదేశించార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆ మ‌హిళ వైఎస్సార్సీపీ గుర్తు త‌ప్పుగా చెబితే దానికి వ‌లంటీర్ ను స‌స్పెండ్ చేయాల‌ని ఆదేశించ‌డం ఏమిట‌ని నారాయ‌ణ‌స్వామి తీరుపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. వ‌లంటీర్ల‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్టు మాట్లాడటం.. వారిని బెదిరింపుల‌కు గురిచేయ‌డం స‌రికాద‌ని అంటున్నారు. వ‌లంటీర్ల‌కు ఇచ్చేదే అతి త‌క్కువ జీత‌మ‌ని.. మ‌ళ్లీ దానికి ఈ బెదిరింపులు, స‌స్పెన్ష‌న్లు ఏమిట‌ని నిల‌దీస్తున్నారు.
Tags:    

Similar News