కాపు నేత‌ల ఆధిప‌త్యంతో ఆ డిప్యూటీ సీఎం అలిగారా?

Update: 2022-09-03 13:30 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని వైఎస్సార్సీపీ లక్ష్యంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు క‌ర్త‌వ్య బోధ చేస్తున్నారు. అయితే అదంతా తేలిక కాద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. సొంత పార్టీలోనే చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైఎస్సార్సీపీ నేత‌ల్లో లుక‌లుక‌లు ఉన్నాయ‌ని అంటున్నారు.

2014 ఎన్నిక‌ల్లో విశాఖ‌ప‌ట్నం జిల్లా మాడుగుల నుంచి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.. బూడి ముత్యాల నాయుడు గెలిచారు. అప్ప‌ట్లో టీడీపీ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ చేప‌ట్టిన‌ప్ప‌టికీ బూడి టీడీపీలో చేర‌లేదు. ఈ విధేయ‌తతో 2019లోనూ వైఎస్సార్సీపీ త‌ర‌ఫున సీటు ద‌క్కించుకుని మ‌రోమారు గెలుపొంది ప్ర‌భుత్వ విప్‌గా కూడా చాన్స్ కొట్టేశారు. ఆ త‌ర్వాత వైఎస్ జ‌గ‌న్ రెండోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సామాజిక స‌మీక‌ర‌ణాలు, విధేయ‌త క‌ల‌సివ‌చ్చి ఏకంగా డిప్యూటీ సీఎం అయిపోయారు. కీల‌క‌మైన పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల‌ను ద‌క్కించుకున్నారు.

అయితే డిప్యూటీ సీఎం అయిన ఆనందం ఆయ‌న‌కు లేద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం బూడి ముత్యాల నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న‌ మాడుగుల కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా అన‌కాప‌ల్లి జిల్లాలోకి వెళ్లింది. అన‌కాప‌ల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ ఉన్నారు. ఈయ‌న కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన నేత కాగా బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారు. చోడ‌వ‌రం, మాడుగుల నియోజ‌క‌వ‌ర్గాలు ప‌క్క‌పక్క‌నే ఉంటాయి. అందులోనూ క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీకి ప్ర‌భుత్వ విప్‌గానూ ఇటీవ‌ల అవ‌కాశం క‌ల్పించారు.

దీంతో అధికారుల అంతా అన‌కాప‌ల్లి జిల్లాలో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మాటే వింటున్నార‌ని బూడి ముత్యాల నాయుడు ఆవేద‌న‌గా ఉంద‌ని చెబుతున్నారు. అందులోనూ క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీకి రెండు ప‌ద‌వులు ఉన్నాయి. ఓవైపు ప్ర‌భుత్వ విప్‌గానూ, మ‌రోవైపు అన‌కాప‌ల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ ఉన్నారు. దీంతో క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ మాటే చెల్లుబాటు అవుతోంద‌ని బూడి ఆందోళ‌న చెందుతున్నార‌ని స‌మాచారం.

పోనీ ప‌క్క‌నే ఉన్న విశాఖ‌పట్నం జిల్లాలో ప్ర‌స్తుతం మంత్రులెవ‌రూ లేరు. ఈ నేప‌థ్యంలో అక్క‌డైనా త‌న హ‌వా సాగిద్దామ‌నుకుంటే అక్క‌డ అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే, ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు శాఖ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ చ‌క్రం తిప్పుతున్నారట‌. గుడివాడ అమ‌ర్నాథ్ కూడా కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన‌వారే. అందులోనూ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ముద్ర ప‌డ్డారు.

డిప్యూటీ సీఎంగా ఉన్న త‌న మాట చెల్లుబాటు కాక‌పోవ‌డం, అధికారుల నియామ‌కాల్లోనూ త‌న హ‌వా సాగక‌పోవ‌డంతో బూడి ముత్యాల నాయుడు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చే ప్ర‌జ‌ల‌పైన, అలాగే గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో త‌న‌ను స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌మ‌ని అడిగేవారిపై ఈ ఆగ్ర‌హాన్ని బూడి చూపుతున్నార‌ని అంటున్నారు. అన‌కాప‌ల్లి జిల్లాలో ఇద్ద‌రు కాపు నేత‌ల జోరుతో త‌న‌కు ప్రాధాన్యం ల‌భించ‌డం లేద‌నే బాధ‌లో ఉన్నార‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News