కర్ణాటకలో షాకింగ్ ఘటన: రైలు పట్టాలపై శవమైన శాసన మండలి డిప్యూటీ చైర్మన్

Update: 2020-12-29 05:04 GMT
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రాష్ట్ర  శాసన మండలి  డిప్యూటీ చైర్మన్, జీడీఎస్ ఎమ్మెల్యే ఎస్ఎల్ ధర్మే గౌడ(64) రైలు పట్టాలపై శవమై తేలారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ధర్మే గౌడ తిరిగి  రాలేదు. ఆయన జాడ కోసం గన్ మెన్లు, పోలీసులు వెతికినా ఫలితం లేకపోయింది. చిక్ మంగళూరు  సమీపంలోని రైల్వే ట్రాక్ పై ధర్మే గౌడ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వారు భావిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి 2 గంటల తర్వాత ధర్మే గౌడ మృతదేహం  పట్టాలపై పడి ఉండగా పోలీసులు కనుగొన్నారు. అయితే ఆయన ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు అనే విషయం ఇంకా తెలీదు.

ధర్మే గౌడ మరణం ఇప్పుడు కన్నడనాట సంచలనంగా మారింది. ఆయన సోదరుడు భోజే గౌడ కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన జీడీఎస్ అధినేత కుమారస్వామికి అత్యంత సన్నిహితుడు. ధర్మే గౌడ వ్యక్తిగత సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక రాజకీయపరంగా ఏమైనా కారణాలు ఉన్నాయా.. అన్నది అంతుబట్టడం లేదు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో ఉన్న ధర్మే గౌడకు ఆత్మహత్యకు పాల్పడాల్సిన సమస్యలు ఏమున్నాయా అన్నది ఇప్పుడు ప్రశ్నాత్మకంగా మారింది.

ధర్మే గౌడ మరణంపై మాజీ ప్రధాని దేవేగౌడ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మే గౌడ ఆత్మహత్యకు పాల్పడడం బాధకరమని అన్నారు. పార్టీ ఓ మంచి నాయకుణ్ణి కోల్పోయిందని ఆయన మరణం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కొద్ది రోజుల కిందట శాసనమండలి చైర్మన్ ప్రతాపశెట్టిపై ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఈ నెల 16న మండలిలో రభస జరిగింది. సభ్యులు ఒకరినొకరు తోసుకునే వరకూ వ్యవహారం వెళ్ళింది.సభాపతి స్థానంలో ఉన్న ధర్మే గౌడను కాంగ్రెస్ సభ్యులు చైర్మన్ సీటునుంచి లాక్కెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. ఈ క్రమంలోనే ధర్మేంద్ర ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది.
Tags:    

Similar News