అంతా అయ్యాకా ఇలా మాట్లాడటమా దేవేగౌడ!

Update: 2019-07-26 10:29 GMT
మొన్నటి వరకూ తన తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపూ దేవేగౌడ ఈ విషయాన్ని చెప్పలేదు. తీరా తన తనయుడికి ఆ ముఖ్యమంత్రి పదవి పోయిన వెంటనే దేవేగౌడ కొత్త కొత్త విషయాలను సెలవిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే.. అసలు తన తనయుడు కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టడమే తనకు ఇష్టం లేదని దేవేగౌడ చెప్పారు!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకా, హంగ్ తరహా ఫలితాలు వచ్చాకా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి పరిస్థితుల గురించి దేవేగౌడ చెప్పారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని  కాంగ్రెస్ వాళ్లే తీసుకోవాలని తను సూచించినట్టుగా దేవేగౌడ చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఎంతోమంది సీనియర్లు ఉన్నారని, వారిలో ఒకరిని ముఖ్యమంత్రిగా చేయాలని తను ఆజాద్ కు సూచించినట్టుగా దేవేగౌడ చెబుతున్నారు.

సిద్ధరామయ్య కాకుండా కాంగ్రెస్ లోని సీనియర్లను ఎవరినైనా ముఖ్యమంత్రిగా చేయాలని, బలం వాళ్లకే ఎక్కువ ఉంది కాబట్టి వారికే ముఖ్యమంత్రి పదవి దక్కాలని తను చెప్పినట్టుగా దేవేగౌడ ఒక జాతీయ మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

అయితే కుమారస్వామే ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలని సోనియాగాంధీ అనుకున్నారని ఆ విషయాన్నే తనకు ఆజాద్ చెప్పారని దేవేగౌడ అన్నారు. కుమారస్వామి ఆరోగ్యం బాగోలేదని చెప్పినా వారు వినలేదని ఆయనే ముఖ్యమంత్రి కావాలని పట్టు పట్టారని దేవేగౌడ అంటున్నారు.

అయితే ఇన్నాళ్లూ  ఇలాంటి విషయాలను దేవేగౌడ  చెప్పలేదు. అలాగే అనుకుని ఉంటే కుమారస్వామి సీఎం పీఠాన్ని వదలుకుని కాంగ్రెస్  సీనియర్లలోఎవరో ఒకరికి ఆ పదవిని అప్పగించి ఉంటే.. అప్పుడు ప్రభుత్వం సవ్యంగా నడిచే పరిస్థితి కూడా ఉండేదేమో అని కూడా పరిశీలకులు అంటున్నారు.
Tags:    

Similar News