కేసీఆర్ భేటీని సింఫుల్ గా తేల్చేసిన మాజీ ముఖ్యమంత్రి

Update: 2022-02-22 04:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఆసక్తిగా చూడటమే కాదు.. జాతీయస్థాయిలో అసలేం జరుగుతుందన్న కుతూహలాన్ని రేకెత్తించిన భేటీగా నిలిచింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మహారాష్ట్ర పర్యటన. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కొత్త జట్టు కట్టాలన్న ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ చేసిన తాజా పర్యటనపై పెద్ద ఎత్తున ఆసక్తి.. చర్చ సాగుతోంది.

ఇలాంటి వేళ.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన సీఎం కేసీఆర్ భేటీని ఆయన సింఫుల్ గా తేల్చేశారు.

గతంలోనూ ఇలానే జట్లు కట్టాలన్న ప్రయత్నాలు సాగాయని.. కానీ ఫలించలేదన్న ఆయన.. 2019 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయన్నారు.

ఔరంగాబాద్ లో మాట్లాడిన ఫడ్నవీస్.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవటం కొత్తేం కాదన్న ఆయన.. ‘గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలే సాగాయి. బీజేపీయేతర పార్టీల ఐక్యత సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయం ఇప్పటికే నిరూపితమైంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ గెలవనుంది’ అని వ్యాఖ్యానించారు.

తాను గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ సీఎంను కలిసిన వైనాన్ని గుర్తు చేశారు. ఉద్ధవ్ ఠాక్రేతో జరిగిన భేటీని దేవేంద్ర ఫడ్నవీస్ సింఫుల్ గా తేల్చేయటమే కాదు.. ఇవన్నీ రోటీన్ భేటీలే అన్నట్లుగా ఆయన మాటలు ఉండటం ఆసక్తికరంగా మారాయి.

చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న నానుడిని దేవేంద్ర మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. కేసీఆర్ ను మొదట చాలామంది తక్కువగా అంచనా వేస్తారని.. ఆ తర్వాత తప్పు చేశామని బాధ పడటం తెలిసిందే. ఇప్పుడు దేవేంద్ర ఫడ్నవీస్ మాటల్ని చూసినప్పుడు అదే భావన కలుగక మానదు. కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనను తక్కువగా అంచనా వేయటం ద్వారా దిద్దుకోలేని తప్పు చేస్తున్నారా? అన్నది కాలమే నిర్ణయించాలి.
Tags:    

Similar News