జూలై 1న ఫ‌డ్నవీస్ ప్ర‌మాణ‌స్వీకారం!

Update: 2022-06-30 10:30 GMT
గ‌త ప‌ది రోజులుగా మ‌లుపుల మీద మలుపులు తిరిగిన మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామాతో క్లైమాక్స్ కు చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఉద్ధ‌వ్ స‌ర్కార్ కూలిపోవ‌డానికి కార‌ణ‌మైన శివ‌సేన రెబల్ నేత ఏక‌నాథ్ షిండే.. బీజేపీ సీనియ‌ర్ నేత మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ తో క‌ల‌సి గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్ సింగ్ కోషియారీని క‌లుస్తార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఏక‌నాథ్ షిండే నేతృత్వంలోని 40 మంది శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు, 8 మంది స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు గోవాలో ఉన్నారు.

ప్ర‌త్యేక విమానంలో అక్క‌డి నుంచి జూన్ 30 గురువారం ముంబై చేరుకుంటార‌ని స‌మాచారం. ఆ త‌ర్వాత ఏక‌నాథ్ షిండే, ఫ‌డ్న‌వీస్ గ‌వ‌ర్న‌ర్ ను క‌లిసి త‌మ మ‌ద్ద‌తును ఇస్తున్న‌వారి ఎమ్మెల్యేల జాబితాను గ‌వ‌ర్న‌రుకు ఇస్తార‌ని చెబుతున్నారు. ఈ భేటీ తరువాత గవర్నర్ అధికారికంగా ఫడ్నవీస్ ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే చాన్సు ఉందని అంటున్నారు.

ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు ఫడ్నవీస్ జూలై 1న శుక్ర‌వారం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీంతో మహారాష్ట్రలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. సీఎంగా ఫడ్నవీస్ .. డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే బాధ్యతలు చేప‌డ‌తార‌ని అంటున్నారు.

ఏక‌నాథ్ షిండేతో క‌లిపి మొత్తం 12 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్ లో కీల‌క శాఖ‌లు ఇస్తార‌ని చెబుతున్నారు. ఈ మేర‌కు ఇప్ప‌టికే షిండే, ఫ‌డ్నవీస్ ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని అంటున్నారు. బీజేపీకి మ‌హారాష్ట్ర శాస‌న‌స‌భ‌లో 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఏక‌నాథ్ షిండే వ‌ర్గంలో 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే మ‌రో 8 మంది వ‌ర‌కు స్వతంత్ర ఎమ్మెల్యేలు షిండే క్యాంపులోనే ఉన్నారు.

మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే 144 మంది ఎమ్మెల్యేల అవ‌స‌రం ఉంది. బీజేపీ 106, శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు 39 మంది క‌లిపితే ఈ మ్యాజిక్ ఫిగ‌ర్ దాట‌నుంది, ఇక స్వ‌తంత్ర ఎమ్మెల్యేల మ‌ద్దతు కూడా ఉండ‌టంతో బీజేపీ ప్ర‌భుత్వానికి వీరు అద‌న‌పు బ‌లం కానున్నారు. మ‌హారాష్ట్ర‌లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 288. ఇటీవ‌ల శివ‌సేన ఎమ్మెల్యే ఒక‌రు మ‌ర‌ణించ‌డంతో ప్ర‌స్తుతం శాస‌న‌స‌భ‌లో 287 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో.. రాజ్ భవన్ నుంచి వచ్చే ప్రకటన కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానంతో పాటుగా సభలో మెజార్టీ నిరూపణకు గవర్నర్ సమయం నిర్దేశించనున్నారు.

మ‌రోవైపు ఉద్ద‌వ్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో జూన్ 30న గురువారం నిర్వ‌హించాల్సిన బ‌ల ప‌రీక్ష ర‌ద్ద‌యిన‌ట్టు శాస‌న‌స‌భ కార్యాల‌యం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే శాస‌న‌స‌భ ప్ర‌త్యేక స‌మావేశం సైతం ర‌ద్ద‌యింది.
Tags:    

Similar News