మ‌ర‌ణించిన వాళ్ల‌నూ ట్రాన్స్ ఫ‌ర్ చేస్తున్నసీఎం

Update: 2016-07-21 09:07 GMT
మ‌హారాష్ట్రలో చ‌నిపోయిన అధికారుల‌నూ బ‌దిలీ చేస్తున్నారు. ఓ అధికారి చనిపోయి మూడేళ్లయిన త‌రువాత ఆయ‌న పేరిట బ‌దిలీ ఉత్వ‌ర్తులు వ‌చ్చాయి. మహారాష్ర్ట ప్ర‌భుత్వం చేసిన ఈ పిచ్చి ప‌ని ఇప్పుడు ఆ రాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ ను సోష‌ల్ మీడియాలో న‌వ్వులపాలు చేస్తోంది. సందు దొరికితే చాలు చెల‌రేగిపోయే  నెటిజ‌న్ల‌కు ఇంత మంచి ఛాన్సు దొరికితే ఆగుతారా.. సెటైర్ల మీద సెటైర్లు వేస్తూ ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వాన్ని ఆడుకుంటున్నారు.

మ‌హారాష్ట్ర ఎక్సైజ్ శాఖలో సబ్ ఇన్‌ స్పెక్టర్‌ గా పనిచేస్తున్న సందీప్ సబాలే 2013 జూలైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆయ‌న చ‌నిపోయి మూడేళ్ల‌యిన త‌రువాత ఈ నెల మొదట్లో జరిగిన 181మంది ఇన్‌ స్పెక్టర్ల బదిలీల్లో ఆయన పేరు కూడా క‌నిపించింది. కొల్హాపూర్ జిల్లాలోని దౌలత్ కోఆపరేటివ్ సుగర్ ఫ్యాక్టరీ నుంచి సతానాలోని ఎక్సైజ్ ఫ్లైయింగ్ స్క్వాడ్‌ కు సందీప్‌ ను బదిలీచేస్తూ ఈ నెల 7న ముఖ్యమంత్రి ఫ‌డ్న‌వీస్ కార్యాలయం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.  ఇంత పెద్ద పొర‌పాటు ఎలా జ‌రిగిందా అని ఆరా తీస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. అస‌లు ఆ అధికారి చ‌నిపోయిన విష‌యం ఆఫీసు రికార్డుల్లో నమోదు కాకపోవడంతో ఈ పొర‌పాటు జ‌రిగింద‌ట‌.

ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే అసెంబ్లీలో ప్రస్తావించడంతో సీఎం కార్యాల‌య చేసిన త‌ప్పు వెలుగులోకి వ‌చ్చింది. జరిగిన తప్పిదానికి ఫడ్నవిస్ ప్రభుత్వం, సిఎంఓ బాధ్యత వహించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు...  బదిలీలు, ప్రమోషన్లలో భారీఎత్తున అవకతవకలు జరిగాయన‌డానికి ఇదే ఆధార‌మ‌ని కూడా కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు కాగా, జరిగిన తప్పిదానికి ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఓ క్లర్క్‌ ను సస్పెండ్ చేయడంతో పాటు సందీప్ మరణాన్ని ఆఫీసు రికార్డుల్లో నమోదు చేయనందుకు సూపరింటెండెంట్‌కు షోకాజ్ నోటీసు జారీచేశారు.
Tags:    

Similar News