దేవేంద్ర ఫడ్నవీస్ పదవి ఆ ఎమ్మెల్యే చేతుల్లోనే..

Update: 2019-11-26 07:23 GMT
సుదీర్ఘంగా సాగుతున్న మరాఠా రాజకీయం కీలక దశకు చేరుకుంది. శనివారం ఎన్సీపీ నేత అజిత్ పవార్ వర్గం మద్దతు తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా శాసనసభలో బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే.. ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా పార్టీతోనే ఉన్నారని, అజిత్ పవార్ వెంట ఎవరూ లేరని ఆ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన కూటమికి 162 మంది ఎమ్మెల్యేలున్నారని ఆ పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ తరుణంలో బుధవారం దేవేంద్ర ఫడ్నవీస్ బల పరీక్షలో నెగ్గుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే, బలపరీక్ష నిర్వహించాలంటే అంతకుముందు ప్రొటెం స్పీకరును నియమించాలి. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి అజిత్ పవార్‌ను పార్టీ నుంచి తొలగించి కొత్త నేతను నియమించడంతో వారిద్దరిలో ఒకరిని ప్రొటెం స్పీకరు శాసనసభాపక్ష నేతగా గుర్తించాలి. ఆ నేత జారీ చేసిన విప్ మాత్రమే అప్పుడు చెల్లుతుంది. అంటే.. టెక్నికల్ బలపరీక్షలో గెలపోటముల సంగతి ప్రొటెం స్పీకరు చేతిలో ఉంటుంది. దాంతో ప్రొటెం స్పీకరు ఎవరన్నదాన్ని బట్టి ఇదంతా ఆధారపడి ఉంటుంది.

నిజానికి సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకరుగా నియమించాలి. ఆ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి చెందిన బాలాసోహెబ్ తోరాట్ అత్యంత సీనియర్ ఎమ్మెల్యే. అదేసమయంలో బీజేపీ కి చెందిన కాళిదాస్ నీలకంఠ్ కొలాంబ్కర్ కూడా సీనియర్ ఎమ్మెల్యేనే. ఈ ఇద్దరూ ఎనిమిదేసి సార్లు మహారాష్ట్ర శాసనసభ కు ఎన్నికయ్యారు.

గతంలో కర్ణాటక లో కూడా ప్రభుత్వం ఏర్పాటులో సంక్షోభం ఏర్పడినప్పుడు సీనియర్ ఎమ్మెల్యేను కాదని బీజేపీ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకరుగా నియమించారు. ఇప్పుడు కూడా మహారాష్ట్ర లో ప్రొటెం స్పీకరుగా నియమించడం కోసం బీజేపీకి చెందిన రాధాకృష్ణ వికే పాటిల్, కాళిదాస్ కొలాంబ్కర్, బాబన్ రావ్ భికాజీల తో పాటు కాంగ్రెస్‌కు చెందిన బాలా సాహెబ్ థోరాట్, కేసీ పాఢ్వి, ఎన్సీపీకి చెందిన దిలీప్ వాల్సే పాటిల్ పేర్ల తో గవర్నరుకు శాసనసభ కార్యదర్శి ఒక జాబితా ఇచ్చారు.

దీంతో కాళిదాస్ కొలాంబ్కర్‌ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రొటెం స్పీకరు పదవి కోసం గవర్నరుకు సమర్పించిన జాబితాలో ఉణ్నవారిలో కాంగ్రెస్ నేత బాలాసాహెబ్ తోరాట్ ఆ రాష్ట్ర పీసీసీ ప్రెసిడెంట్. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పడితే ఆయనకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న అంచనాలున్నాయి. ఈ లిస్టులోని కాళిదాస్, రాధాకృష్ణ పాటిల్‌లు మొన్నటి ఎన్నికలకుముందు జులైలో బీజేపీ లో చేరిన నేతలు. ఇక బాబన్ రావు కూడా 2014 ఎన్నికల సమయం లో బీజేపీలోకి వచ్చారు.

కాళిదాస్ కొలాంబ్కర్‌ను ప్రొటెం స్పీకరుగా నియమిస్తే ఆయన అజిత్ పవార్‌నే ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా గుర్తిస్తారని.. అప్పుడు అజిత్ పవార్ విప్ జారీ చేయడం వల్ల ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా ఫడ్నవీస్ కు అనుకూలంగా ఓటేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో మహా రాజకీయం మొత్తం ఇప్పుడు కాళిదాస్ చేతుల్లోకి వెళ్లనుందని తెలుస్తోంది.Dwe
Tags:    

Similar News