బెజ‌వాడ టీడీపీలో కొత్త గ్రూపు

Update: 2016-08-30 06:22 GMT
ఏపీలో అధికార పార్టీ టీడీపీలోకి జంపింగ్‌ ల ప‌ర్వం కొన‌సాగుతోంది. మొన్న‌టి వ‌ర‌కు జ‌గ‌న్ పార్టీ నేత‌ల‌ను వ‌రుస పెట్టి సైకిల్ ఎక్కించుకున్న చంద్ర‌బాబు.. తాజాగా కాంగ్రెస్‌ లో మొన్న‌టి వ‌ర‌కు భారీస్థాయిలో చ‌క్రం తిప్పిన నేత‌ల‌కు కూడా ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. దీంతో విజ‌య‌వాడ‌లో మంచి ప‌లుకుబ‌డి ఉన్న నేత‌ - మాజీ మంత్రి దేవినేని రాజ‌శేఖ‌ర్‌(నెహ్రూ )  స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా చంద్ర‌బాబు చెంత‌న సైకిల్ ఎక్కేందుకు సిద్ధ‌మైపోయారు. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం ఆయ‌న త‌న మందీ మార్బ‌లం స‌హా కుమారుడు అవినాష్‌ తో చంద్ర‌బాబును క‌లిశారు. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు తాము సిద్ధ‌మేన‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా బాబుకు వెల్ల‌డించారు. అయితే, అధికారికంగా మాత్రం వ‌చ్చేనెల 9న వీరు సైకిల్ ఎక్క‌నున్నారు.  

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన నెహ్రూ.. గ‌తంలో జంపింగ్ జిలానీలు వ‌ల్లె వేసిన స్క్రిప్ట్‌నే ప‌ఠించారు. రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామ‌ని, చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తరువాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు దేవినేని పేర్కొన్నారు. కాగా, టీడీపీ ఆయ‌న‌కు రాజ‌కీయ ఏబీసీడీలు నేర్పిన పార్టీ కావ‌డం గ‌మ‌నార్హం. దివంగ‌త ఎన్‌ టీఆర్ స‌మ‌యంలో దేవినేని టీడీపీలో చేరారు. ఇక‌, దేవినేని జంప్‌ తో విజ‌య‌వాడ కాంగ్రెస్‌ కు పెద్ద దెబ్బేన‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

విజ‌య‌వాడ టీడీపీలో కొత్త గ్రూపు :

దేవినేని నెహ్రూ టీడీపీలోకి చేర‌డంతో విజ‌య‌వాడ సైకిల్ పార్ట‌లో కొత్త గ్రూపు ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఎంపీ కేశినేని వ‌ర్గం - సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా వ‌ర్గం - మంత్రి ఉమా వ‌ర్గం - గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ వ‌ర్గం - తూర్పు ఎమ్మెల్యే గ‌ద్దే రామ్మోహ‌న్ వ‌ర్గం...  ఇలా విజ‌య‌వాడ‌లో అనేక గ్రూపులు ఉన్నాయ‌ని, ఇప్ప‌డు తాజాగా దేవినేని చేరిక‌తో మ‌రో కొత్త వ‌ర్గం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని, నేత‌ల మ‌ధ్య‌ ఆధిప‌త్య పోరు త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అయితే, గుణ‌ద‌ల నుంచి సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో దేవినేనికి మంచి ప‌ట్టుంది. నెహ్రూ కార్య‌క‌లాపాల‌న్నీ ఇక్క‌డి నుంచే జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఇక్క‌డ సెంట్ర‌ల్ నియోజ‌క‌వర్గం ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమాకి దేవినేని చెక్ పెట్టే అవ‌కాశం లేక‌పోలేదు. దీంతో భ‌విష్య‌త్తులో ఈ ప‌రిణామం చంద్ర‌బాబుకు సంక‌టంగా మారే ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. 
Tags:    

Similar News