14 రీళ్లు కాదు.. 24 రీళ్లు అయిపోయాయంట

Update: 2016-06-16 05:03 GMT
జగన్ చేసిన సినిమా విమర్శలకు ఏపీ తెలుగుదేశం నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాజీ మంత్రి.. జగన్ తండ్రి వైఎస్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పే ఆనం రామనారాయణ రెడ్డి సహా పలువురు తెలుగుదేశం నేతలు జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చెప్పిన సినిమా రీళ్ల భాషలోనే తమ్ముళ్లు జగన్ వైఖరిని దుమ్మెత్తిపోశారు. తాజాగా మాట్లాడిన వారంతా.. తమ ప్రెస్ మీట్లలో సినిమా రీళ్ల భాషలోనే జగన్ తీరును తప్పు పట్టటం.. ఘాటుగా విమర్శలు చేయటం గమనార్హం.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడ్ని ఉద్దేశించి మాట్లాడిన జగన్ 16 ఏళ్ల సినిమాలో 14 రీళ్ల వరకూ విలన్ అధిక్యంలో ఉన్నా.. 16 రీల్ వచ్చే హీరోదే పైచేయి అని వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్ వ్యాఖ్యలు చేసిన ఆనం సహా పలువురు తెలుగు తమ్ముళ్లు.. సినిమా రీళ్లతోనే జగన్ మీద విరుచుకుపడ్డారు. ఏపీ రాష్ట్రానికి అసలుసిసలు విలన్ జగనేనని.. ఆయన ఎప్పటికి హీరో కాలేరని ఆనం స్పష్టం చేశారు. జగన్ హావభావాలు చూసినా విలనే గుర్తుకు వస్తారన్నారు. ఇప్పటికే 24 రీళ్లు పూర్తి అయ్యాయని.. మరో 36రీళ్లు అయ్యాక మరోసారి చంద్రబాబును హీరోను చేయటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రౌడీ గ్యాంగ్ కు లీడర్ గా ఉన్న జగన్ కు వచ్చే ఎన్నికల్లో బడితె పూజ ఖాయమన్న ఆనం.. వచ్చే ఎన్నికల్లో మైనస్ మార్కులు రావటం ఖాయమన్నారు.

ఆనం తరహాలోనే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 14 రీళ్ల సినిమాలో మొదటి రీల్ లోనే జగన్ జైలుకు వెళ్లారని.. మధ్యలో ఎంటర్ టైన్ మెంట్ కోసం జైలు నుంచి బయటకు వచ్చినట్లుగా ఎద్దేవా చేశారు. దేశంలోనే అతి పెద్ద విలన్ జగన్ అంటూ మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. సభ్యత.. సంస్కారం లేకుండా జగన్ వ్యవహరిస్తున్నారని.. కల్లు తాగిన కోతిలో ఆయన తీరు ఉందంటూ తెలుగు తమ్ముళ్లు ఆయనపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు తమ్ముళ్లు రీళ్ల పేరిట జగన్ ను తిట్టినా.. ఒక్కో తెలుగుతమ్ముడి సినిమా రీళ్ల లెక్క ఒకలా ఉండటం ఏమిటో..? ఏది ఏమైనా ఎవరి సినిమా వారిదేమో..?
Tags:    

Similar News