నోట్ 7తో వెళ్తే విమానాల్లోకి నో ఎంట్రీ!

Update: 2016-09-10 04:35 GMT
బ‌హుశా స్మార్ట్ ఫోన్ చ‌రిత్ర‌లోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పాలి! ఆ నిర్ణ‌యం ఏంటంటే... విమానంలో ప్ర‌యాణించాలంటే ఆ మోడ‌ల్ మొబైల్ ఫోన్ చేతిలో ఉండ‌కూడ‌దు. ఆ ఫోన్ తో వ‌స్తే విమానంలోకి అనుమ‌తించ‌రు. ఇంత‌కీ ఆ మోడ‌ల్ ఏంటంటే... శ్యామ్‌సంగ్ గేలాక్సీ నోట్ 7. ప్ర‌యాణ స‌మ‌యంలో ఈ మోడ‌ల్ ఫోన్ల‌ను అనుమ‌తించ‌డం లేద‌ని భార‌త్ విమాన‌యాన అత్యున్న‌త సంస్థ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్ర‌క‌టించింది. ద‌య‌చేసి ఈ మోడ‌ల్ ఫోన్ల‌ను ప‌ట్టుకుని విమానాలు ఎక్కొద్దు అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. ఒక్క మ‌న‌దేశంలోనే మాత్ర‌మే ఈ నిషేధం పెట్టార‌నుకుంటున్నారా... సింగ‌పూర్‌, ఆస్ట్రేలియాతో స‌హా ప‌లు విదేశాల్లో నోట్ 7తో ప్ర‌యాణాన్ని నిషేధించేశాయి!

శ్యామ్‌సంగ్ గ్యాలెక్సీ నోట్ 7 మొబైల్ గ‌త నెల‌లో లాంచ్ అయింది. ఎంతో అట్ట‌హాసంగా దీన్ని విడుద‌ల చేశారు. మొబైల్ ఫోన్ల‌లో ద బెస్ట్ అనే రేజింలో ఫీచ‌ర్లు ఇందులో ఉన్నాయి. కానీ, ఈ మోడ‌ల్ ఫోన్ల‌లో బ్యాట‌రీ స‌మ‌స్య త‌లెత్తి పేలిపోతున్నాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు ఓ 35 దాకా ప్ర‌పంచవ్యాప్తంగా న‌మోద‌య్యాయి. దీంతో నోట్ 7 మోడ‌ల్ ను రీకాల్ చేసింది శ్యామ్‌ సంగ్ సంస్థ‌. ఇప్ప‌టికే ఫోన్ కొన్న‌వారికి డ‌బ్బులు వాప‌సు ఇస్తోంది. ప్ర‌స్తుతానికి ఈ మోడ‌ల్ అమ్మకాల‌ను అధికారికంగా నిలిపేసింది.

పేలుడు స‌మ‌స్య ఉంది కాబ‌ట్టి... స‌దరు మోడ‌ల్ నోట్ 7తో ప్ర‌యాణం హానికార‌కం అని విమాన‌యాన సంస్థ‌లు భావించాయి. అందుకు, ఆ మోడ‌ల్ ఫోన్‌తో విమాన ప్ర‌యాణానికి రావొద్దంటూ ప్రయాణికుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నాయి. అయితే, ఇక్క‌డో చిన్న వెసులు బాటును కూడా క‌ల్పిస్తున్నాయి. ఒక‌వేళ ఈ నిషేధాజ్ఞ‌ల గురించి తెలుసుకోకుండా నోట్ 7తో ఎవరైనా ఎయిర్ పోర్ట్‌ కు వ‌స్తే.. ఫోన్ స్విచాఫ్ చేయాల‌ని చెబుతున్నారు! ఎయిర్ పోర్టులో ఎంట‌ర్ అయిన ద‌గ్గ‌ర నుంచీ... విమాన ప్ర‌యాణం ముగిసి మ‌ర‌లా ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌ట‌కి వెళ్లే వ‌ర‌కూ స్విచ్ ఆన్ చేయ‌కూడ‌దు!
Tags:    

Similar News