ఐల‌య్య‌పై కేసు పెట్టాల‌ని డీజీపీ ఆదేశం

Update: 2017-09-19 06:09 GMT
ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఎంత మేధావి అయినా.. మ‌నోభావాల్ని దెబ్బ తీసేలా వ్యాఖ్య‌లు చేయ‌టం.. పుస్త‌కాలు రావ‌టం లాంటివి స‌రి కాదు. నా ఇష్టం.. నా మెద‌డుకు ఏం తోస్తే అది రాస్తానంటే కుద‌ర‌దు. కానీ.. ప‌రిమితుల్ని ప‌ట్టించుకోకుండా మేధోత‌నం ట్యాగ్ లైన్ పెట్టేసి ఇష్టారాజ్యంగా రాత‌లు రాసేసే ఐల‌య్య తీరుపై ఇప్ప‌టికే ప‌లువురు మండిపడుతున్నారు. ఈ మ‌ధ్య‌న ఆయ‌న రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అంటూ ఆయ‌న రాసిన పుస్త‌కంపై పెను దుమార‌మే రేగింది.

ఐల‌య్య పుస్త‌కంపై ఆర్య‌వైశ్యులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌గా.. అందుకు ప్ర‌తిగా మ‌రింత రెచ్చ‌గొట్టేలా ఆయ‌న తిరిగి స్పందిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవ‌రైనా తాము రాసిన పుస్త‌కం.. తీసిన సినిమా మీద పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు.. నిర‌స‌న‌లు రేగుతున్నా.. త‌మ మ‌నోభావాలు దెబ్బ తిన్న‌ట్లుగా గ‌ళం విప్పితే వెంట‌నే రియాక్ట్ కావ‌టం ఉంటుంది. కానీ.. ఐల‌య్య మాత్రం అందుకు భిన్నం.

త‌న రాత‌ల్ని త‌ప్పు ప‌ట్టే వారిని మ‌రింత కించ‌ప‌రిచేలా మాట్లాడుతున్నార‌న్న విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఐల‌య్య పుస్త‌కంపై కేసులు న‌మోదు చేయాలంటూ ఆర్య‌వైశ్యులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని ఏపీ పోలీసులు.. ఇప్పుడు మాత్రం కేసు క‌ట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ఐల‌య్య పుస్త‌కంపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు డిసైడ్ కావ‌టం.. ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావుతో భేటీ అయిన ఆయ‌న‌.. కుల‌.. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నారంటూ ఆర్య‌వైశ్య సంఘాలు చేస్తున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో ఆయ‌న‌పై కేసు న‌మోదు చేయాల‌ని చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు రియాక్ట్ అయిన‌.. ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య‌పై కేసు న‌మోదు చేయాల‌ని ఆదేశాలు జారీ చేయ‌టం గ‌మ‌నార్హం. ఒక సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా.. మ‌నోభావాలు దెబ్బ తినేలా పుస్త‌కం రాసిన ఐల‌య్యపై ఫిర్యాదు వ‌చ్చిన వెంట‌నే రియాక్ట్ కావాల్సిన పోలీసులు.. ముఖ్య‌మంత్రి చెప్పిన త‌ర్వాతే కేసు న‌మోదు చేయాల‌ని డీజీపీ స్థాయి అధికారి ఆదేశించ‌టం ఏమిట‌న్న ప్ర‌శ్న త‌లెత్తుతోంది. చ‌ట్టం ప్ర‌కారం త‌న ప‌ని తాను ఎందుకు చేయ‌రో?
Tags:    

Similar News