‘ధరణి’కి ఏడాది.. సమస్యల పరిష్కారానికి మార్గమేది..?

Update: 2021-10-29 08:32 GMT
లంచాలు ఇవ్వనక్కర్లేదు.. భూముల రిజిస్ట్రేషన్ కోసం రోజుల కొద్దీ ఆగాల్సిన పనిలేదు.. ఎక్కడంటే అక్కడికి.. ఎప్పడంటే అప్పుడు భూములకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ధరని పోర్టల్ ను ప్రారంభించింది. ఇందులో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సాగుభూముల వివరాలు అందుబాటులో ఉంటాయి. రైతులు తమ భూ సమస్య పరిష్కారానికి అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పని లేకుండా నేరుగా ఆన్లౌన్లో పరిష్కరించుకోవడానికి ఈ అవకాశం కల్పించింది. ఈ పోర్టల్ ను గతేడాది అక్టోబర్ 29న మెదక్ జిల్లాలో కేసీఆర్ ప్రారంభించారు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ అప్పటికప్పుడు జరిగిపోగా.. వారం, పదిరోజుల్లోగా పాస్ బుక్ నేరుగా ఇంటికే పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.

భూ లావాదేవీలకు సంబంధించి ధరణి వెబ్ సైట్ కేంద్ర బిందువుగా నిలిచింది. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. కానీ ధరణి అందుబాటులోకి వచ్చిన తరువాత తహసిల్దార్లకు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ హోదా కల్పించారు. ఇందులో ఎక్కువగా వ్యవసాయానికి సంబంధించిన భూముల లావాదేవీలు ఎక్కువగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 574 తహసిల్దార్ల కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉన్న సబ్ రిజిస్ట్రార్ల కార్యాలయాలను తీసేయకుండా వాటిలో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.

మెదక్ జిల్లాలోని మూడు చింతలపల్లిలో గతేడాది అక్టోబర్ 29న ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ధీంతో వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ధరణి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా నిపుణులు వాటిని పరిష్కరించారు. ఒకే రోజులో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరిగిపోతుందన్నారు. ధరణి ప్రారంభంతో ప్రభుత్వ భూములన్నీ నిషేధిత జాబితాల్లోకి వెళ్లిపోయాయి.

ధరణి వెబ్ సైట్ ఏర్పడిన ఏడాదిలో అనేక లావాదేవీలు నిర్వహించారు. మొత్తంగా లక్షల కొద్దీ లావాదేవీలు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. 10,45,878 స్లాట్లు బుక్ చేయగా.. 10,00,973 లావాదేవీలు అయ్యాయి. భూ విక్రయదారులకు సంబంధించినవి 5,02,281 అయితే, గిప్ట్ రిజిస్ట్రేషన్లు 1,58,215, పౌతి 72,085, తనఖా 58, 285 రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. గతంలో పాస్ బుక్ లు ఇవ్వని 1.80 లక్షల భూములకు ధరణి ప్రారంభమైన తరువాత వాటిని ధరణి పరిధిలోకి తెచ్చామంటున్నారు. ప్రస్తుతం ధరణిలో 31 లావాదేవీల మా డ్యూల్స్, 10 సమాచార మ్యాడ్యూల్స్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు సమాచారాన్ని, అవసరాన్ని భట్టి పోర్టల్ ను మారుస్తూ వస్తున్నారు.

ఈ వెబ్ సైట్లో కేవల భూ లావాదేవీలే కాకుండా భూ సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు. పెండింగ్ మ్యూటేషన్లతో పాటు ఇతర భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకునేందుకు అధికారులు ప్రత్యేక మాడ్యూల్స్ ప్రవేశపెట్టారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు పరిశీలించి వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక ధరణి పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 5.17 లక్షల ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా ధరణి వెబ్ సైట్ కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటోంది. వెబ్ సైట్ ఇంకా పూర్తి స్థాయిలో అప్ గ్రేడ్ కాలేదు. ధరణి అందుబాటులోకి వచ్చినా కొందరికి భూమి హక్కు పత్రాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. భూ సమస్య పరిష్కరించే అధికారం తహసిల్దార్లకు ఉండగా.. దానిని కలెక్టర్లకు అప్పగించారు. దీంతో సమస్యల పరిష్కారంలో జాప్యం సాగుతోంది. ధరణి వెబ్ సైట్లో పట్టాదారుల వివరాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అసైన్డ్, ఇనాం, శివాయి, జమేదారి, లావుణి పట్టా భూమలు కనిపించడం లేదని రైతులు అంటున్నారు. దరఖాస్తులు ఎంత వరకు వెళ్లాయో తెలుసుకునే అవకాశం లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని అంటున్నారు.


Tags:    

Similar News