జగన్ మళ్ళీ సీఎం కాకపోతే...వీర లెవెల్ శపధమిది... ?

Update: 2022-01-04 10:30 GMT
జగన్ సీఎం గా సగం పాలన పూర్తి చేశారు. ఇంకా ఆయనకు మరో ముప్పయి నెలల కాలం అధికారం ఉంది. అయినా సరే ఇప్పటి నుంచే ఎన్నికల కోసం అంతా ఆలోచిస్తున్నారు. ఈ మధ్యనే ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే ముందస్తు ఎన్నికలు వస్తాయని కామెంట్స్ చేశారు. తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అలాంటి ఆలోచన తమ పార్టీకి లేనే లేదని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి బాబుకు గట్టి  రిటార్ట్ ఇచ్చేశారు. ఇదిలా ఉండగానే వైసీపీలో కూడా ఎన్నికల మీద మధనం పెద్ద ఎత్తున  జరుగుతోంది.

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగినా ముందస్తు వచ్చినా కూడా మళ్లీ ఏపీలో అధికారం దక్కేది జగన్ కే అని ఆ పార్టీలో చాలా మంది అంటున్నారు. కొందరైతే మ‌రింతగా ముందుకెళ్ళి జోస్యాలు కూడా వదులుతున్నారు. జగనే మళ్లీ సీఎం అవుతారని ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి ఢోకా లేదని కూడా అంటున్నారు.

ఇక ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అయితే జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవడం ఖాయం. ఈ విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు అని చెప్పేశారు. ఒకవేళ జగన్ ముఖ్యమంత్రి కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ వీర లెవెల్ లో శపధం చేసి పారేశారు.

జగన్ని ఎవరైనా తక్కువ అంచనా వేస్తే అంతకంటే పొరపాటు మరోటి లేదని కూడా ధర్మాన అంటున్నారు. జగన్ కోసం ప్రాణాలు ఇచ్చే నాయకులు కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారని గుర్తుచుకోవాలని ఆయన విపక్షాలను హెచ్చరించారు. రాష్ట్రానికి జగన్ అవసరం చాలా ఉందని కూడా ధర్మాన అంటున్నారు.

జగన్ ఆలోచనలు వేరు అని ఆయనకు రాజధాని కంటే కూడా ప్రజల ప్రయోజనాలు ముఖ్యమని, వారి సమస్యల పరిష్కారమే ఆయన అసలైన అజెండా అని కూడా ధర్మాన చెబుతున్నారు. రాజధానిని వేల కోట్లతో నిర్మిస్తామని విపక్షాలు చేస్తున్న ప్రకటనల మీద కూడా ఆయన సంచలన కామెంట్స్ చేసారు. రాజధాని ఎంత గొప్పగా కట్టినా కొరుక్కు తింటామా అని ప్రశ్నించారు.

 ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలను చూడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆ విషయంలో జగన్ తాను చేయాల్సింది చేస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. ఈ విషయంలో విపక్షాలకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన విమర్శలు చేశారు.  మొత్తానికి వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుపు మీద తొలి పందెం ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణదాస్ కాశారనుకోవాలి. మరి రానున్న రోజుల్లో అటూ ఇటూ కూడా ఇంకెంతమంది జోస్యం చెబుతారో, పందేలు కాస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News