మంత్రి ధర్మానకు సోదరుడి షాక్

Update: 2021-07-17 23:30 GMT
పాత వాసనలు ఎంతైనా పోవు. ఉమ్మడి ఏపీలో శ్రీకాకుళం మంత్రిగా వైఎస్ఆర్ హయాంలో వెలుగు వెలిగారు ధర్మాన ప్రసాద్ రావు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లోనూ ఆయన చక్రం తిప్పారు.

అయితే వైసీపీ పార్టీలో చేరినా జగన్ సీఎం అయినా కూడా ధర్మాన ప్రసాదరావుకు కేబినెట్ లో చోటు దక్కలేదు. అదే సమయంలో ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కింది. అయితే ఆ సోదరుడు మాత్రం ప్రసాద్ రావు ముందు తేలిపోతూనే ఉన్నారన్న గుసగుసలున్నాయి.

తాజాగా ఏపీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు చేదు అనుభవం ఎదురైంది.తూర్పుగోదావరి జిల్లా జక్కంపేట మండలం రాజపూడిలో రోడ్డు నిర్మాణ శంకుస్తాపన కార్యక్రమానికి వెళ్లిన ధర్మాన కృష్ణదాస్ కు ఊహించని షాక్ తగిలింది. శిలాఫలకంపై కృష్ణదాస్ కు బదులుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఫొటో చూసి అందరూ షాక్ తిన్నారు. అధికారులు చేసిన నిర్వాకానికి మంత్రి ధర్మాన కృష్ణ దాస్ తీవ్ర అసహనానికి గురయ్యారు.

ఇక అధికారులు నాలుక కరుచుకొని తప్పు జరిగిందని ప్రసాద్ రావు ఫొటోపై పెయింట్ వేశారు. ఇక ఇదంతా చూసిన వైసీపీ నాయకులు అధికారులు తీరు చూసి అవాక్కయ్యారు. ఏపీ మంత్రిని గుర్తించలేరా? అంటూ అధికారులపై మండిపడ్డారు. అధికారుల తీరుపై విమర్శలు గుప్పించారు.

తూర్పుగోదావరి జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ వ్యవహరిస్తున్నారు. రెండు రోజులుగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శంకుస్తాపన శిలాఫలకంపై ధర్మాన కృష్ణదాస్ కు బదులుగా ఆయన సోదరుడు ధర్మాన ప్రసాద్ రావు ఫొటోను పెట్టడంతో ఇప్పుడు ఇది పెద్ద దుమారం రేపింది.

ఇద్దరు సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయని శ్రీకాకుళంలో టాక్. ఇప్పుడు ప్రసాద్ రావు ఫొటో పెట్టడంతో అధికారులపై మంత్రి కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు శంకుస్తాపన కార్యక్రమంలో గందరగోళం చోటుచేసుకుంది.

ఇక కొందరైతే చాలా రోజులు మంత్రిగా చేసిన ప్రసాదరావును మరిచిపోలేక ఇలా చేసి ఉంటారని సెటైర్లు వేస్తున్నారు. మంత్రి కృష్ణదాస్ ను జనాలు, అధికారులు గుర్తించడం లేదంటూ ఎద్దేవా చేశారట.. మొత్తానికి ఈ వ్యవహారంలో సీనియర్ మంత్రిగా సేవలందించిన ప్రసాద్ రావు ముద్ర స్పష్టంగా తెలుగు రాజకీయాల్లో ఉందని తేలింది. కొత్తగా మంత్రి అయిన కృష్ణదాస్ ను ఇంకా ఎవరూ గుర్తించడం లేదన్న వాస్తవం తెలుసొచ్చింది.
Tags:    

Similar News