ఉత్తరాంధ్రాలో మరో ఆనం... ?

Update: 2021-11-16 17:48 GMT
వైసీపీలో మాజీ మంత్రి ఆనం రామనాయణరెడ్డిది డిఫరెంట్ స్టైల్. ఆయన సొంత పార్టీ ప్రభుత్వం మీదనే తరచుగా  కామెంట్స్ చేస్తారు. అధికారుల మీద అయితే  ఆయన  ఘాటుగానే విమర్శలు చేస్తారు. మరి అధికారులు అంటే వారు ప్రభుత్వంలోని వారే. ఆ విధంగా చూసుకుంటే ఆనం ప్రభుత్వం మీదనే తన ఆగ్రహాన్ని వెళ్ళాగక్కుతున్నట్లుగా లెక్క. నెల్లూరు జిల్లాలోని ఆనం రామనారాయణరెడ్డి మాదిరిగానే ఉత్తరాంధ్రాలో కూడా మరో మాజీ మంత్రి ఉన్నారు. ఆయన కూడా వైసీపీలో సీనియర్ ఎమ్మెల్యే. శ్రీకాకుళానికి చెందిన ధర్మాన ప్రసాదరావు. గత రెండున్నరేళ్ళుగా ప్రసాదరావు తన మనసులోని భావాలను ఎక్కడా దాచుకోలేదు.

ఆయన చెప్పాల్సిన దాన్ని చెప్పాల్సిన దాన్ని సూటిగా చెబుతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. . అప్పట్లో శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన వైద్య ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని ముందే ప్రభుత్వ తీరుని విమర్శించిన ధర్మాన మీడియాలో హైలెట్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా ధర్మాన ప్రభుత్వ పనులను చేస్తున్న  కాంట్రాక్టర్ల విషయాన్ని ప్రస్తావించి  సర్కారీ విధానాలతో   వారు అన్ని రకాలుగా దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట ఓపెన్ మార్కెట్ లో సిమెంట్ ధరలు మండిపోతూంటే ప్రభుత్వం రేటు తక్కువగా కడుతోందని, దీని వల్ల సర్కారీ పనులు అంటే   కాంట్రాక్టర్లు జడుసుకునే పరిస్థితి ఉంది అన్నారు. ఈ విషయంలో అధికారులు  కూడా  అసలు విషయాన్ని పక్కన పెట్టి ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు, చివరికి ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని ధర్మాన అనడం విశేషం.

ఇసుక, సిమెంట్, ఐరన్ ధరలు మండిపోతూంటే అందులో సగానికి సగం ధరలకు పనులు చేయమంటే కాంట్రాక్టర్లు తమ ఇళ్ళు ఒళ్ళూ గుల్ల చేసుకోవడం తప్ప చేసేది లేదని కూడా ఆయన అంటున్నారు. ఈ విషయంలో తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డితో మాట్లాడానని, అవసరం అయితే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి కాంట్రాక్టర్లు నష్టపోకుండా చూసుకుంటామని చెప్పడం విశేషం. మొత్తానికి కాంట్రాక్టర్ల సమస్యను ధర్మాన ప్రస్తావించినా ఆయన ఒక విపక్ష నేత మాదిరిగానే మీడియా మీటింగ్ పెట్టి మరీ చెప్పడం, కొన్ని విమర్శలు చేయడం వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది.

ధర్మాన చాలా కాలంగా మంత్రి పదవి ఆశిస్తున్నారు. అయితే మరి ఆయన ఇపుడు ఏకంగా ప్రభుత్వ అధికారులను విమర్శిస్తూ మాట్లాడడంతో ఆయన మంత్రి పదవి ఆశలు వదిలేసుకున్నారా లేక దక్కదనే ఇలా మాట్లాడుతున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ధర్మాన డేరింగ్ అండ్ డేషింగ్ అని పేరు. దాన్ని ఆయన మరోసారి రుజువు చేసుకున్నారని,  ఎక్కడా తగ్గేది లేదని చెబుతున్నారని  అంటున్నారు.
Tags:    

Similar News