రాజ్యసభ అడుగుతున్న ధర్మాన.. ఎన్నికలయ్యాక చూద్దామంటున్న జగన్!

Update: 2023-01-04 23:30 GMT
ఉత్తరాంధ్ర నుంచి రాజకీయాల్లో ఉంటూ కీలక పదవులు చూసిన నేతల్లో ధర్మాన ప్రసాదరావు కూడా ఒకరు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి అనేకమార్లు మంత్రి పదవులు పొందిన ఆయన ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారట. అందుకోసం... తనకు బదులు కుమారుడు రామ్‌మనోహర్ నాయుడికి టికెట్ కేటాయించి తనను రాజ్యసభకు పంపించాలని వైసీపీ అధినేత, సీఎం జగన్‌కు చెవిలో ఇల్లు కట్టుకుని మరీ చెప్తున్నారట. కానీ, జగన్ మాత్రం నవ్వుతూనే ఆ విషయం దాటవేస్తున్నారని టాక్.

నిజానికి గత ఎన్నికలకు ముందే ధర్మానను శ్రీకాకుళంలో ఎంపీ పదవికి పోటీ చేయాలని జగన్ ఒత్తిడి చేశారు. కానీ... ధర్మాన మాత్రం ఎందుకో అధినేత మాటకు అంగీకరించలేదు. ఎంపీ పదవికి పోటీ చేస్తే జిల్లాలోని అన్ని అసెంబ్లీల ఎన్నికల ఖర్చు తనపైనే పడుతుందనే భయం... కింజరాపు కుటుంబంతో తలపడడానికి ఇష్టపడకపోవడం వంటి కారణాలు అక్కడ అనేకం ఉన్నాయి. మొత్తానికి ఆ ఎన్నికల్లో ఆయన జగన్‌ ఒత్తిడి నుంచి ఎలాగో తప్పించుకుని శ్రీకాకుళం అసెంబ్లీకే పోటీ చేసి గెలిచారు. జగన్ మొదటి కేబినెట్లో మంత్రి పదవి దక్కించుకోకపోయినా రెండో సారి విస్తరణలో అవకాశం అందుకున్నారు.

అయితే.. ప్రస్తుతం ఏపీలో వైసీపీ గత ఎన్నికల సమయం నాటి హవా లేకపోయినా కూడా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం వరకు అనుకూలంగా ఉండడంతో కుమారుడు రామ్‌మనోహర్ నాయుడిని ఎమ్మెల్యే చేయడానికి ఇదే మంచి అవకాశంగా భావిస్తున్నారు ధర్మాన. ముఖ్యంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీలో టికెట్ రేసులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడం.. ఎవరికి ఇచ్చినా వేరొకరు వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఉండడంతో దాన్ని తమకు అనుకూలంగా మలచుకుని కుమారుడిని గెలిపించుకోవచ్చన్నది ధర్మాన ఆలోచనగా చెప్తున్నారు.

అదేసమయంలో కుటుంబంలోనూ ధర్మానకు తన సోదరుడు కృష్ణదాస్‌తో పోటీ నెలకొంది. ఆయన కూడా మంత్రిగా పనిచేయడంతో వెలమ సామాజికవర్గంలో, సొంత బంధువర్గంలో తనతో సమాన స్థాయి పొందుతున్నారు. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు కూడా దూకుడు గల నేతగా పేరు తెచ్చుకోవడంతో ఆయన భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో తన కుమారుడిని అంతకంటే ముందే ఎమ్మెల్యే చేసి తాను రాజ్యసభ ఎంపీగా వెళ్తే సోదరుడికి కంటే పైస్థాయిలో కనిపిస్తానన్నది ఆయన భావనగా చెప్తున్నారు. ధర్మాన ప్రసాదరావు ఎప్పుడూ తన చేయే పైన ఉండాలని కోరుకునే రకమని.. అందుకే.. సోదరుడితోనూ పోటీ పడుతుంటారని ఆయన్ను బాగా తెలిసినవారు అంటున్నారు.

అయితే... ధర్మాన ప్రసాదరావు ఎన్ని కోరికలు కోరుతున్నా జగన్ మాత్రం ఆయనకు ఓకే చెప్పడం లేదని.. పార్టీకి ఆయన ఉపయోగపడడం లేదని, శ్రీకాకుళంలో కింజరాపు కోటను బద్ధలుకొట్టడానికి ఏమాత్రం సహకరించడంలేదన్న భావన జగన్‌లో ఉంది. అందుకే.. ధర్మాన గొంతెమ్మ కోర్కెలకు జగన్ ఏమాత్రం లొంగడం లేదని చెప్తున్నారు.
Tags:    

Similar News