సేఫ్ జోన్ లో మంత్రి గారు ?

Update: 2022-02-19 23:30 GMT
ఏపీలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరుగుతుందని ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతోంది. ఇపుడున్న వారిలో తొంబై శాతం మంత్రులను  తప్పించేస్తారని, కొత్త వారికి పదవులు కట్టబెడతారని కూడా అంటున్నారు. అయితే కొత్త వారిని తీసుకోవాలంటే చాలా జిల్లాల్లో ఇపుడు ఉన్న వారికి ధీటైన వారు ఉన్నారా అన్నదే చర్చగా ఉంది. శ్రీకాకుళం జిల్లాని విభజిస్తే ఇపుడు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితం అయింది.

ఇందులో రెండు టీడీపీ గెలుచుకున్నవి తీసేస్తే ఆరున్నాయి. వీటిలో  మరో రెండింటిలో గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కాయి. వారే ధర్మాన క్రిష్ణదాస్, సీదరి అప్పలరాజు. వీరిని తప్పిస్తే జిల్లాకు ఒకే ఒక మంత్రి పదవి వస్తుంది. మరి ఆ ఒకే ఒక్కడు ఎవరూ అంటే ఇప్పటికైతే వేట సాగుతోంది కానీ ఫలనా వారికి అని గట్టిగా చెప్పలేని స్థితి.

ఆశావహుల్లో చూసుకుంటే ఆముదాలవలస నుంచి గెలిచి స్పీకర్ అయిన తమ్మినేని సీతారాం ఉన్నారు. ఆయన తొలి విడతలోనే తనకు మంత్రి పదవి ఖాయమని అనుకున్నారు. కానీ జగన్ ఆయన్ని స్పీకర్ గానే చేసి పెద్దరికాన్ని కట్టబెట్టారు. అయితే ఈసారి తనకే మంత్రి ఇవ్వాలని ఆయన అడుగుతున్నారు. కానీ తమ్మినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఆముదాలవలసలో వైసీపీకి రాజకీయంగా వరసగా  ఇబ్బందులే ఎదురవుతున్నాయి.

ఇక్కడ టీడీపీ బాగా పుంజుకుంది. దాంతో పాటు జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ గా ఉన్న కూన రవికుమార్ గట్టిగానే ఉన్నారు. దాంతో తమ్మినేనికి ఇది మైనస్ అవుతుంది అని అంటున్నారు. పైగా ఆయన వయసు రిత్యా కూడా రేసులో నుంచి తప్పించేస్తారు అని కూడా చెబుతున్నారు. మరో వైపు చూస్తే ధర్మాన ప్రసాదరావు ఉన్నారు.

ఆయన శ్రీకాకుళం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ మధ్య దాకా ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా విమర్శలు చేస్తూ వచ్చారు. కొన్ని సార్లు అవి విపక్షాలకు ఆయుధంగా మారాయి, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఇక ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు చూస్తే టీడీపీయే ముందంజలో ఉంది. పైగా వచ్చే ఎన్నికల్లో గెలుపు అన్నది ఇక్కడ వైసీపీకి డౌట్ గా చెబుతున్నారు.

మరో ఇద్దరు ఎమ్మెల్యేలు పాతపట్నం నుంచి రెడ్డి శాంతి, ఎచ్చెర్ల నుంచి గొర్ల కిరణ్ కుమార్ ఉన్నారు. ఈ ఇద్దరూ తమ నియోజకవర్గంలోనే పార్టీని సరిగ్గా  లీడ్ చేయలేక అవస్థలు పడుతున్నారని వైసీపీలోనే చర్చగా ఉంది. దాంతో ఎటు నుంచి ఎలా చెప్పుకున్నా ధర్మాన  క్రిష్ణదాస్ నే కంటిన్యూ చేస్తారు అని అంటున్నారు. జిల్లా రెండుగా విడిపోవడంతో రెండవ మంత్రి సీదరి అప్పలరాజు పదవి మాత్రం లేకుండా పోతుంది అని జోస్యం చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News