గ్రౌండ్ రిపోర్ట్ : ధర్మ'వరం' ఎవరికో?

Update: 2019-03-27 05:30 GMT
– బరిలో గోనుగుంట్ల వర్సెస్‌ కేతిరెడ్డి

తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న ధర్మవరం నియోజకవర్గంలో ఈసారి హోరాహోరా పోటీ నెలకొంది. ఈసారి కూడా గోనుగుంట్ల వర్సెస్‌ కేతిరెడ్డి కుటుంబ సభ్యులే బరిలో ఉన్నారు. గత 2014 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా టీడీపీ హవా ఉండటంతో ధర్మవరంలో గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్‌ వరదాపురం సూరి విజయం సాధించారు. అయితే గెలిచిన తర్వాత ఆయన స్థానికంగా ఎలాంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయలేదనే విమర్శలు భారీ స్థాయిలో ఉన్నాయి. అంతేకాకుండా వైఎస్సార్‌ సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గం వ్యాప్తంగా నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను ఉన్నానంటూ ముందుకు వచ్చారు. ఫలితంగా ఈసారి ఆయనకు విజయం దక్కే అవకాశం ఉంది.

‘ఆరు నెలలు దూసుకుపోండి’

అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు వీరవిహారం చేయాలని.. ప్రత్యర్థులను నరికి చంపాలని సిట్టింగ్‌ ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులతో చెప్పిన ఆడియో ఫైల్‌ వైరల్‌ అయింది. ఫలితంగా ఆయన గెలిస్తే హత్యా రాజకీయాలు మొదలవుతాయని ప్రజల్లో భయం నెలకొంది. దీనికి తోడు ప్రతి పనికీ ఎమ్మెల్యేకు కమీషన్‌ ఇవ్వాల్సి వస్తోందని కూడా టీడీపీ కార్యకర్తలే పలుమార్లు మీడియా ముందుకు వచ్చి వాపోయిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. దీంతో ఈసారి ఎమ్మెల్యేను మార్చాలనే సంకల్పంతో ధర్మవరం నియోజకవర్గ ఓటర్లు ఉన్నట్లు తేలింది. దీంతో వరదాపురం సూరికి చెక్‌ పెట్టి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. గతంలో 2009 – 2014 వరకు ఎమ్మెల్యేగా కేతిరెడ్డి ఎన్నో సేవలు చేశారని ప్రజల్లో నాటుకు పోయింది.

గోనుగుంట్ల సూర్య నారాయణ చౌదరి

2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట రాకపోవడంతో స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి 40 వేలు పైగా ఓట్లు సాధించారు. అప్పట్లో కుదుర్చుకున్న పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థి డి.జగదీశ్‌ ను టీడీపీ బరిలో దించింది. ఫలితంగా టికెట్‌ ఆశించి భంగపడ్డ వరదాపురం స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగి రెండోస్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి భారీ విజయం సాధించి తొలిసారిగా ఎమ్మెల్యే పదవి అలంకరించారు. అనంతరం 2014 ఎన్నికల్లో రెండు పార్టీల నుంచి వీరిద్దరే పోటీ చేశారు. కానీ వరదాపురం సూరి గెలిచారు. కాగా ప్రస్తుతం మళ్లీ వీరి మధ్యనే పోటీ ఉండటంతో ఈసారి ఫలితం ఎటూ చెప్పలేం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే స్థానిక ప్రజలు మాత్రం వైఎస్సార్‌ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విజయావకాశాలు

– ధర్మవరం నియోజకవర్గంలో బీసీ ఓటర్లు అధికంగా ఉన్నారు.

– చేనేతలకు పుట్టినిల్లు ధర్మవరం. అయితే చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.

– ఫలితంగా ఈసారి వైఎస్సార్‌సీపీ గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

– కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి చేనేతల కోసం దీక్షలు - ధర్నాలు చేయడం. బీసీల వెంటన తిరగడం.. కలిసొచ్చే అంశాలు.

2019 – గోనుగుంట్ల వర్సెస్‌ కేతిరెడ్డి
2014 – గోనుగుంట్ల సూర్యనారాయణచౌదరి
2009 – కేతిరెడ్డి వెంటకరామిరెడ్డి
2004 – గోనుగుంట్ల జయలక్ష్మమ్మ
1999 – కేతిరెడ్డి సూర్యప్రతాప్‌ రెడ్డి



Tags:    

Similar News