జయలలిత వీడియోలు నా దగ్గరే-దినకరన్

Update: 2017-11-13 08:24 GMT
దివంగత ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నపుడు ఆమె కోరిక మేరకు తీసిన వీడియోలన్నీ తన దగ్గరే ఉన్నాయని అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ చెప్పాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో వారికి ఈ వీడియోలు దొరికాయని.. వాటిని వాళ్లు తీసుకెళ్లిపోయారని వస్తున్న వార్తల్ని దినకరన్ ఖండించాడు. ఆ వీడియోలన్నీ తన వద్దే ఉన్నాయని.. జయలలిత కోరిక మేరకే ఆ వీడియోలు తీశామని అన్నాడు దినకరన్. కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారమే తమ కుటుంబ సభ్యులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులతో దాడులు చేయించారని దినకరన్ ఆరోపించాడు. ఇలాంటి దాడులకు తాము ఏమాత్రం భయపడమని.. ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొంటామని అన్నాడు దినకరన్.

కేంద్రంలోని పెద్దలతో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమ్మక్కయ్యారని దినకరన్ ఆరోపించాడు. ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను శంకర్.. రాజమౌళిల సినిమాల తరహాలో చూపించేందుకు 186 ప్రాంతాల్లో దాడులు చేయించారని దినకరన్ అన్నాడు. ఈ దాడుల అనంతరం దినకరన్ తన కుటుంబ సభ్యులతో కలిసి తమిళనాడులోని వివిధ ఆలయాలకు తిరుగుతూ ప్రత్యేక పూజలు.. హోమాలు చేయిస్తుండటం విశేషం.
Tags:    

Similar News