జగన్ పై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన ధూళిపాళ్ల..

Update: 2020-01-04 04:35 GMT
ఏపీ రాజధాని అమరావతిలో భూముల్ని పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కొనుగోలు చేశారని.. రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటానికి ముందే ఇన్ సైడ్ ట్రేడింగ్ భారీ ఎత్తున జరిగినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తరచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో టీడీపీ నేతలు భారీ ఎత్తున భూముల్ని కొనుగోలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న వేళ.. దాన్ని తిప్పి కొట్టేందుకు వీలుగా మాజీ ఎమ్మెల్యేలు బొండా ఉమ..ధూళిపాళ్ల నరేంద్రలు రంగంలోకి దిగారు.

తమ మాటల చాతుర్యంతో జగన్ కు.. ఆయన కుటుంబానికి ఇన్ సైడర్ ట్రేడింగ్ మకిలి అంటించే ప్రయత్నం చేశారు. జగన్ తోపాటు.. ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేసిన వారి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయన్నది చూస్తే..

%  జగన్ తాడేపల్లిలోని ఆయన ఉంటున్న ఇంటిని ఎవరి దగ్గర్నుంచి కొనుగోలు చేశారు?  మా దగ్గరున్న సమాచారం ప్రకారం.. కాంక్రీట్ అండ్ లైట్ స్టోన్ ఇన్‌ఫ్రా అనే సంస్థ తాడేపల్లిలో 2016 నుంచి పొలాలను కొనుగోలు చేసింది. జగన్ తన ఇంటిని తన సతీమణి భారతి - సండూరు పవర్ కంపెనీ - హరీశ్ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్ పేరిట కొనుగోలు చేశారు.

%  ఈ రెండు సంస్థలు సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నాయి. జగన్ తన బినామీలతో ఈ భూములను కొనుగోలు చేయించారు. 2016లో కాంక్రీట్ అండ్ లైట్ స్టోన్ ఇన్‌ ఫ్రా పేరిట పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేశారు.

%  తాడేపల్లిలో జగన్ నివాసం రాజధానికి కూతవేటు దూరంలో ఉంది. అక్కడ ఏ విధంగా భూములను సేకరించారు..? సంస్థల కోసం భూములను సేకరించి.. అందులో నుంచి మూడెకరాలను జగన్‌ కు బహుమానంగా ఇచ్చిన మాట వాస్తవం కాదా? జగన్‌కు మూడెకరాలు బహుమతిగా ఇచ్చారంటే.. వాళ్లంతా ఆయన బినామీలని తెలుస్తోంది. 

%  రాజధాని సమీపంలో ఇన్ని ఎకరాలను సేకరించారంటే.. ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ కు పాల్పడినట్టు కాదా?  వైఎస్ భారతి ఆ ఇంటిని 2019 ఫిబ్రవరి 8న కొనుగోలు చేస్తే.. అదే నెల చివర్లో గృహప్రవేశం చేశారు. ఇది సాధ్యమేనా..? మూడేళ్ల క్రితమే మీ కోసం ఇంటి నిర్మాణం ప్రారంభించారు.. దీన్ని బట్టి మీరు ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ కు పాల్పడ్డారని అర్థం అవుతోంది కదా?

%  జగన్ తరఫున ఆ కంపెనీలు పెద్ద ఎత్తున భూములను సేకరించి.. ఆయన కోసం రాజసౌధం నిర్మించాయి. సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న మీ కంపెనీలు మీరుంటున్న భవనాన్ని కొనుగోలు చేశాయి. మాపై ఏ విచారణ కావాలన్నా చేసుకోండి. తాడేపల్లి ప్రాంతంలో.. సీఎం ఉంటున్న ఇల్లు సహా.. జగన్, ఆయన బినామీలు భూములు కొనుగోలు చేశారు.

 % ఇండియా సిమెంట్స్ అధినేత సరస్వతి సిమెంట్స్ - సాక్షిలో భారీ ధరకు షేర్లను కొనుగోలు చేశారన్నారు. మేం తప్పు చేస్తే మా భూములను తీసుకోండి. ప్రతిపక్షంలో ఉండి ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణలు చేస్తే ఎలా? జగన్‌ కు చిత్తశుద్ధి ఉంటే.. తాడేపల్లిలో జరిగిన ఇన్‌ సైడర్ ట్రేడింగ్‌ ను కూడా విచారణ పరిధిలోకి తేవాలి.

%  2015 చివరి నుంచి 2016 వరకు తాడేపల్లి ప్రాంతంలో భారీగా భూములను కొనుగోలు చేశారు. అమరావతిలో ఇన్‌ సైడర్ ట్రేడింగ్ జరిగిందని భావిస్తే... అందులో తొలి ముద్దాయి జగన్ అవుతారు. వైఎస్ భారతిని - సండూరు కంపెనీని - హరీశ్ ఇన్‌ ఫ్రాను విచారణ పరిధిలోకి తీసుకు రావాలి. ఆన్‌లైన్‌లో రికార్డులను పొందా. అన్‌ ఆథరైజ్డ్ లేఅవుట్‌ లో సీఎం ఉంటున్నారు.


Tags:    

Similar News