కరవు జిల్లాలో వజ్రాల గనులు ఉన్నాయా?

Update: 2016-03-10 03:49 GMT
ప్రకృతి ఎవరికి అన్యాయం చేయదని అంటుంటారు. వినేందుకు వింతగా ఉన్నా.. ప్రతి ప్రతికూలత ఏదో ఒక సానుకూలతకు నిదర్శనంగా చెప్పే మాటకు తగ్గట్లే ఉంది తాజాగా బయటకొచ్చిన సమాచారం. కరవు జిల్లాగా.. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన మహబూబ్ నగర్ జిల్లా రూపురేఖలు మొత్తంగా మారిపోయే మాట ఒకటి బయటకు వచ్చింది.

వలసల జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్ జిల్లాలో వజ్ర నిక్షేపాలున్న విషయాన్ని రాజ్యసభలో కేంద్రమంత్రి తోమర్ బదులిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట.. మద్దూరు.. కోట కొండలో వజ్ర నిక్షేపాలున్న మాట నిజమేనని.. ఇప్పటివరకూ జరిపిన పరీక్షల్లో ఈ విషయం తేలిందన్న విషయాన్ని కేంద్రమంత్రి తోమర్ వెల్లడించారు. టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ అడిగిన ఒక ప్రశ్నకు బదులచ్చిన తోమర్ .. మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని మట్టి.. రెగోలిక్ పొరల మధ్య కింబర్లెట్ పైపులు ఉన్నట్లుగా గుర్తించిన విషయాన్ని వెల్లడించారు. కింబర్లెట్ పైపులు అన్నవి వజ్రాల శిలలుతో కూడినవిగా చెబుతుంటారు.

అయితే.. వీటి నుంచి వజ్రాలు వస్తాయా? రావా? అన్నది తేలాల్సి ఉందని చెప్పుకొచ్చారు. పెద్దసంఖ్యలో నమూనా పరీక్షలు జరపాలని సంబంధిత శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఆయన వెల్లడించారు. అనుకున్న రీతిలో వజ్రాలు కానీ పడితే.. పాలమూరు రూపురేఖలు మారిపోవటం ఖాయం. అంతా మంచే జరగాలని ఆశిద్దాం.
Tags:    

Similar News