ఢిల్లీ టూర్ తో జగన్ కి క్లారిటీ వచ్చిందా...?

Update: 2022-12-29 03:50 GMT
ఏపీ సీఎం జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ అజెండాలో చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రిగా రాష్ట్ర రాజకీయాలను ఎటూ కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారు. అదే సమయంలో రాజకీయ అంశాలు కూడా ఉండకుండా ఈ భేటీలు ఉండవని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ దాదాపుగా గంటపాటు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో కొంతసేపు రాజకీయాల గురించి కూడా మాట్లాడుకున్నారని ప్రచారం సాగుతోంది.

నిజానికి ఏపీ సీఎం ఢిల్లీ టూర్ వెనక చాలా విషయాలే ఉన్నాయని అంటున్నారు. నవంబర్ 11న విశాఖ వచ్చిన ప్రధాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ణి ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ ఆయనతో ఏకాంత చర్చలు జరిపారు. ఇక చంద్రబాబుని జీ 20  సన్నాహక సదస్సుకు అహ్వానించారు. దానికి ముందు కూడా చంద్రబాబు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముగింపు  సన్నాహక  సదస్సుకు వెళ్ళారు. కేంద్ర పెద్దలతో టీడీపీ టచ్ లో ఉంటోందన్న సంకేతాలు అయితే ఉన్నాయి.

తెలంగాణలో బీజేపీకి ఉన్న రాజకీయ అవసరాల నేపధ్యంలో చంద్రబాబుని దువ్వుతున్నారు అని అంటున్నారు. బాబుకు ఏపీ రాజకీయ క్షేత్రం కావాలి. దాంతో పరస్పర అవగాహనతో రెండు పార్టీలు కలుస్తాయని ఒక ప్రచారం అయితే ఉంది. దాంతో మోడీ  అమిత్ షాల మనసులో ఏముందో అన్న విషయం మీద క్లారిటీ కోసం జగన్ ఢిల్లీ టూర్ ఉందని అంటున్నారు.

అయితే మోడీ షాలు ఈ విషయంలో అంత సులువుగా బయటకు తేల్చరని అంటున్నారు. వారు ఏపీ రాజకీయం తమకు అనుకూలంగానే వాడుకుంటున్నారు. అలాగే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. వచ్చే ఏడాది చివర్లో కానీ తెలంగాణా ఎన్నికలు జరగవు. అప్పటికి ఏపీ ఎన్నికలు కూడా దగ్గరపడతాయి.

దాంతో అపుడు బీజేపీ టీడీపీతో పొత్తు విషయం బాహాటం చేసినా వైసీపీతో వచ్చిన ఇబ్బందులు ఉండవు. పైగా వైసీపీతో అవసరాలు కూడా తీరిపోతాయని అంటున్నారు. అపుడు ఏపీ రాజకీయ ముఖ చిత్రం కూడా మరింత స్పష్టంగా కనిపిస్తుందని దాంతో బీజేపీ అపుడు ఆలోచనలు పూర్తిగా తాను కోరుకున్న తీరున చేసుకునేలా ఉంటాయని అంటున్నారు. ఇలా ఆప్షన్లు అన్నీ తన చేతిలో పెట్టుకుని బీజేపీ మరో ఏడాది పాటు ఇలా వైసీపీ తెలుగుదేశంల మధ్య దగ్గరా దూరామా అన్నది చెప్పకుండా దాగుడు మూతల రాజకీయం ఆడుతూనే ఉంటుందని అంటున్నారు.

ఇక జగన్ ఢిల్లీ టూర్ లో చూసుకుంటే ఏపీకి సంబంధించిన అన్ని విషయాలు కేంద్రం దృష్టిలో పెట్టినా మోడీ ప్రభుత్వం వాటిలో ఎన్ని పరిష్కరిస్తుంది అన్నది కూడా సందేహమే అంటున్నారు. ఏపీ విషయంలో కేంద్ర పెద్దలకు ఎపుడూ ఉన్న అభిప్రాయమే ఉంటుంది తప్ప మారేది ఉండదని అంటున్నారు. విన్నపాలు వినవలె అని ఇలాంటి భేటీలలో వాటిని వింటూనే ఉంటారు తప్ప ఆచరణకు మాత్రం అవకాశాలు తక్కువగానే ఉంటాయని అంటున్నారు. నిజానికి కేంద్రం ఏపీకి మేలు చేయదలచుకుంటే పదే పదే జగన్ ఢిల్లీ వెళ్ళనవసరం లేకుండానే చాలా విషయాలలో ఈపాటికే పరిష్కారం లభించేదని కూడా అంటున్నారు.

పైగా విభజన హమీలు కానీ విభజన చట్టంలో ఉన్నవి కానీ కేంద్ర పెద్దలకు తెలియదు అని ఎవరైనా అనుకుంటే పొరపాటే అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి. రాష్ట్రం ఆర్ధికంగా ఎంతటి సంక్షోభంలో ఉన్నదో కూడా కేంద్రానికి తెలుసు అని అంటున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ 2022 వస్తూనే  జనవరి 5న చేశారు. నాడు ప్రధానికి కలసి వచ్చారు. అది లగాయితూ ఢిల్లీకి చాలాసార్లు జగన్ వెళ్లారు. ఇక ఇయర్ ఎండింగ్ లో ఫైనల్ టచ్ గా డిసెంబర్ 28న మళ్లీ వెళ్ళి కలిశారు. 2022 ముగుస్తోంది కానీ బీజేపీ నుంచి అద్భుతాలు అయితే ఆశించలేమనే అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News