మూడు రాజధానుల ఇష్యూను కేసీఆర్ కు జగన్ ముందే చెప్పారా?

Update: 2021-11-23 05:34 GMT
ఏపీ రాజకీయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. వీటన్నింటికి కర్త..కర్మ.. క్రియగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు. తన తీరుకు భిన్నంగా.. తాను తీసుకున్న నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకునే కష్టమైన పనికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న జగన్ కు చాలా కష్టమైన ప్రక్రియగా చెప్పక తప్పదు.

తానెంతో ముచ్చటపడటమే కాదు.. నమ్మకంతో మూడు ప్రాంతాల్ని సమంగా డెవలప్ చేయాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవటం తెలిసిందే. కొత్తగా మరో సమగ్రమైన బిల్లును తీసుకొస్తామని చెప్పినా.. అది కూడా మూడు రాజధానుల చుట్టూనే తిరుగుతుందా? లేదంటే.. మొదట్లోనే డిసైడ్ అయిన అమరావతి వరకే పరిమితమవుతుందా? అన్నది తేలాల్సి ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారా? లేదా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఏపీలో నెలకొన్న పరిస్థితులకు భిన్నంగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మనమరాలి పెళ్లికి హాజరు కావటం తెలిసిందే.

ఓవైపు దారుణమైన వర్షాలు.. భారీ వరదల కారణంగా ఏపీలోని నాలుగు జిల్లాలు ప్రధానంగా దెబ్బ తిన్న వేళ.. వాటికి సంబందించిన సహాయ పునరావాస కార్యక్రమాల మీద ఫోకస్ చేయాల్సిన వేళ.. అందుకు భిన్నంగా సీఎం జగన్.. శంషాబాద్ లో జరిగిన పెళ్లికి హాజరుకావటం ఆసక్తికరంగా మారింది.

ఈ పెళ్లి వేడకలో ఇద్దరు తెలుగు సీఎంలు పక్కపక్కనే కూర్చోవటమే కాదు.. కలిసి భోజనం కూడా చేశారు. ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్నారు. ఈ ఏకాంత సంభాషణ ఏమై ఉంటుందన్న దానిపై మాత్రం క్లారిటీ రావటం లేదు. అయితే.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు మాత్రం కొత్త సందేహాలకు తావిస్తోంది.

కేసీఆర్ కుటుంబానికి చెందిన మీడియా సంస్థల్లో పని చేసి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ గా వ్యవహరిస్తున్న కట్టా శేఖర్ రెడ్డి తన ట్వీట్ లో మూడు రాజధానుల చట్టాన్ని వెనక్కి తీసుకోవాలన్న సలహాను ఇవ్వటం తెలిసిందే.

ఇదంతా చూసినప్పుడు పెళ్లి వేడుక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏపీ సీఎం జగన్ షేర్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువన్న మాట వినిపిస్తోంది. అనుభవంతో పాటు.. ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత వాటి విపరిణామాలు ఏ రీతిలో ఉంటాయన్న దానిపై కేసీఆర్ విశ్లేషణ అర్థవంతంగా ఉంటుందని చెబుతారు.

ఏ అంశానికి సంబంధించి అయినా సరే.. సలహా కోరితే.. వెనక్కి తగ్గరన్న పేరుంది. ఇవన్నీ చూస్తుంటే.. ఏపీ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్న ఉదంతం గురించి సీఎంజగన్ అంతో ఇంతో షేర్ చేసుకొని ఉంటారన్న అభిప్రాయాన్ని పలువురు బలపరుస్తుండటం గమనార్హం.


Tags:    

Similar News