కేసీఆర్ నోటి నుంచి వచ్చిన ఆ మాటతో దళిత ద్రోహి అయిపోయినట్లేనా?

Update: 2022-02-02 06:46 GMT
కోపంతో ఉన్న వేళలో కేసీఆర్ ఎంత మాట పడితే అంత మాటను అనేస్తారన్నది తెలిసిందే. అయితే.. ఆయన కోపం పాల పొంగులా ఉంటుంది. కోపంలో ధాంధూం అనే ఆయన.. తాను కోరుకున్నట్లుగా మారితే అప్పటివరకు ఆగ్రహాన్ని ప్రదర్శించే ఆయన.. అంతకు మించిన అనుగ్రహాన్ని ప్రదర్శిస్తుంటారు. గడిచిన కొద్దికాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు మీద గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్.. తాజాగా కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

 ఆయన ఆగ్రహం ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని ఆయన తన మాటలతోనూ.. తిట్లతోనూ చెప్పేశారు. సాధారణంగా సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడరు. అమితమైన ఆనందాన్ని కలిగించిన సమయంలో మీడియాతో పంచుకోకుండా ఉంటారు కానీ.. తాను అమితమైన ఆగ్రహాంతో ఉన్న వేళ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తూ.. గంటల పాటు మీడియాతో మాట్లాడిన తీరు చూస్తేనే ఆయన ఫస్ట్రేషన్ ఎంతన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది.

మాటల మధ్యలో 75 ఏళ్ల  స్వతంత్య్ర భారతంలో అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని మార్చేయాలన్న కొత్త మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చేసింది. అవసరమైతే తన వాదనను దేశ వ్యాప్తంగా ప్రచారం చేసేందుకు సైతం తాను సిద్ధంగా ఉన్నట్లుగా తన మాటలతో కేసీఆర్ చెప్పేశారు. కేసీఆర్ నోటి నుంచి రాజ్యాంగాన్ని మార్చేయాలన్న మాట వచ్చినంతనే ఆయనకు భారీగా కౌంటర్ ఇచ్చేశారు బండి సంజయ్. కేసీఆర్ నోటి నుంచి వచ్చిన రాజ్యాంగాన్ని మార్చేయాలన్న మాటకు కొత్త అర్థాన్ని ఇచ్చిన ఆయన.. కేసీఆర్ దళిత ద్రోహి అంటూ కొత్త పల్లవిని అందుకున్నారు.

తన వాదనకు బలం చేకూరే అంశాల్నిఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చారు. రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించారని.. కేసీఆర్  ఏనాడు అంబేడ్కర్ జయంతి.. వర్థంతికి రాలేదని.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టలేదన్నారు. కానీ.. బీజేపీ మాత్రం అంబేడ్కర్ స్ఫూర్తి కేంద్రాల్ని పెట్టి.. ఆయన చరిత్రను భావి తరాలకు అందిస్తున్నట్లు చెప్పారు.

గత చరిత్రను తెరమరుగు చేసి.. కుటుంబ రాజ్యాంగాన్ని ప్రజలకు చెప్పుకోవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని.. డిప్రెషన్ లో రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న తన అక్కసు బయటపెట్టినట్లుగా సంజయ్ మండిపడుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తిరగరాస్తుందని గతంలో కేసీఆర్ చెప్పారని.. ఇప్పుడు బడ్జెట్ చర్చ కంటే కూడా అంబేడ్కర్ మీద కేసీఆర్ చేసిన వ్యాఖ్యల మీద చర్చ జరగాలన్నారు.

 కేసీఆర్ మిడతల కంటే అపాయకరమని.. ప్రెస్ మీట్ పెట్టి బుడ్డర్ ఖాన్ మాటలు చెప్పారన్నారు. తెలంగాణలో రైతులు కోటీశ్వరులైతే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. ఉద్యోగాలు ఇస్తే.. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన ఖర్మ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. మొత్తానికి కేసీఆర్ దళిత ద్రోహి అన్న విషయంపై బండిచేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయని చెప్పక తప్పదు. రాజ్యాంగాన్ని మార్చేయాలన్న కేసీఆర్ మాటలు ఆయనకు కొత్త సవాళ్లను ఎదురయ్యేలా చేస్తుందనే చెప్పాలి.

Tags:    

Similar News