అయ్యయ్యో ఎంతటి ఘోరం? అవన్నీ కేసీఆర్ మాట్లాడాల్సి వచ్చిందే?

Update: 2022-11-16 13:30 GMT
కొన్నిసార్లు అంతే. కష్టం వచ్చినప్పుడు అది కేసీఆర్ అయినా బరస్ట్ కావాల్సిందే. అందుకు ఆయన సైతం మినహాయింపు కాదు కదా? తాజాగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో  కూడిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ అధినేత కమ్ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే కాదు.. రాజకీయ సంచలనానికి వేదికగా మారింది. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి ఎప్పటిలానే దుర్మార్గం.. దారుణం.. ఘోరం లాంటి పదాలు వచ్చేశాయి.

తాను చేసేది ఏదైనా ధర్మబద్ధం.. న్యాయబద్ధం.. నిబంధనలకు అనుగుణం అనుకునే తీరు కేసీఆర్ మాటల్లో వినిపిస్తూ ఉంటుంది. అదే సమయంలో తనకు ఇబ్బంది కలిగించే ఏ విషయమైనా సరే.. ఘోరం.. దారుణమన్నట్లుగా ఆయన మాట్లాడతారు. ప్రతిపక్ష పార్టీలు అన్నవే ఉండకుండా చేసేందుకు ఆయా పార్టీలకు చెందిన నేతల్ని ఏ రీతిలో పార్టీలోకి చేర్చుకున్నారో తెలిసిందే.

ఎవరిదాకానో ఎందుకు.. టీడీపీ బొమ్మ మీద గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఏకంగా మంత్రి పదవిని ఇప్పించేసిన వైనం మొదలు పెడితే.. ఆయా పార్టీలకు చెందిన నేతల్ని తమ పార్టీలోకి తీసుకొచ్చేయటమే కాదు. .పలు పార్టీలు ఉనికిలోకి లేకుండా చేసిన టాలెంట్ కేసీఆర్ సొంతమన్నది తెలిసిందే.

అలాంటి ఆయన.. తాజాగా తన కుమార్తె కవితను బీజేపీలో చేరాల్సిందిగా అడిగారని.. అంతకు మించిన ఘోరం ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు. అందుకే తాను బీజేపీతో యుద్ధం చేయనున్నట్లుగా చెప్పారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. కేసీఆర్ సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూసినప్పుడు.. పార్టీ వేదిక మీద కానీ.. ప్రభుత్వ వేదిక మీద కానీ ఎప్పుడూ.. ఏ నాడు కూడా నా కుమార్తె.. నా కుమారుడు లాంటి మాటలు కేసీఆర్ నోటి నుంచి వచ్చింది లేదు. అదే సమయంలో కవిత.. కేటీఆర్ లు సైతం పార్టీ అధ్యక్షుల వారు.. గౌరవనీయ ముఖ్యమంత్రి అంటూ సంబోదిస్తుంటారే తప్పించి.. ఎప్పుడూ కూడా మా నాన్న.. అంటూ రక్తసంబంధాన్ని ప్రస్తావించటం ఉండదు.

ఇన్నాళ్లు గుర్తుకు రాని కూతురు మాట.. ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చిందెందుకు? అన్నది చూస్తే.. సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించటానికే అన్న మాట రాజకీయ వర్గాల నోటి నుంచి వినిపిస్తున్నాయి. కేసీఆర్ కుమార్తెనే బీజేపీ వాళ్లు పార్టీ మారమని అడిగారన్న మాట సామాన్యులకు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుందని.. తండ్రి మీద కూతురు చేత యుద్ధం చేయించే ఆలోచనలో కమలనాథులు ఉన్నారన్న భావన కలిగేలా కేసీఆర్ మాటలు ఉన్నాయంంటున్నారు.

ఇంతకూ కేసీఆర్ కుమార్తెను బీజేపీలోకి తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నాలు జరిగాయి? అన్నదిప్పుడు ప్రశ్న.  ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి కుమార్తెను పార్టీ మారాలనే ఆఫర్ ఆమెకు ఎందుకు ఇచ్చారు? ఏ సందర్భంలో ఇచ్చారు? వారికి ఎందుకంత ధైర్యం? అన్న ప్రశ్నలు కేసీఆర్ పుణ్యమా అని ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పటికే కవిత మీద ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఆరోపణలు ఉండటం తెలిసిందే. దాని మీద ఎలాంటి విమర్శలు.. వ్యాఖ్యలు.. ఆరోపణలు చేయొద్దంటూ కోర్టు నుంచి ఆదేశాల్ని తెచ్చుకున్నారు.

తన కుమార్తెను కూడా పార్టీ మారాలని బీజేపీనేతలు అడిగారని.. వారెంత దుర్మార్గులన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిన కేసీఆర్ మాటల వరకు బాగానే ఉన్నా.. తర్వాతి కాలంలో ఎదురయ్యే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సిన ఇబ్బందిని ఎదుర్కునే వీలుందంటున్నారు. ఇంతకాలం తనకు తానుగానే పోరాటం చేసిన కేసీఆర్.. తాజా ఎపిసోడ్ లోనూ కుమార్తె ప్రస్తావన తేకుండా ఉండి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ మారాలన్న మాట ఒకవేళ బీజేపీ వర్గాల నుంచి వచ్చింది నిజమే అయితే.. దానికి అవకాశం ఇచ్చిందన్న మాట కూడా చర్చకు వస్తుందన్న లాజిక్ ను సీఎం కేసీఆర్ ఎలా మిస్ అయ్యారన్న మాట వినిపిస్తోంది. కూతురు సెంటిమెంట్ ప్రస్తావన తేకుండా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News