ఢిల్లీకి కేసీఆర్ వెళ్లారా? వెళ్లేలా మోడీ చేశారా?

Update: 2022-07-27 04:51 GMT
ఉత్తినే ఏదీ జరగదు. అందునా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఊరికే ఏ పని చేయరు. అందునా దేశ రాజధాని ఢిల్లీకి కానీ.. విదేశీ పర్యటనలు కానీ.. ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ పక్కా ప్రణాళికతో మాత్రమే ఆయన వెళుతుంటారు. అలాంటి కేసీఆర్ ను.. ఆయనకు ఎంతో ఇష్టమైన ప్రగతి భవన్.. ఫామ్ హౌస్ గా పిలిచే ఫార్మర్ హౌస్ ను విడిచి.. ఢిల్లీకి పరుగులు తీయాల్సిన పరిస్థితి వెనుక ప్రధాని మోడీనే కారణమా? అన్న ప్రశ్నకు అవునన్న సమాధానం వినిపిస్తోంది. తాజాగా ఢిల్లీలో ఉన్న ఆయన.. మంగళవారం మొత్తం ఆయన గడిపిన కాలాన్ని.. ఏయే అంశాలకు ఆయన సమయాన్ని వెచ్చించారన్న విషయాన్ని గమనిస్తే.. అసలు విషయం ఇట్టే అర్థమైపోతుంది.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే పలు డెవలప్ మెంట్ పనులకు సంబంధించి వివిధ సంస్థలతో చేసుకున్న రుణ ఒప్పందాలకు భిన్నంగా.. ఆయా రుణ సంస్థలు వ్యవహరిస్తున్న తీరుతో గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్..  ఢిల్లీకి బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా చెప్పాలి. అన్నింటికి మించి కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్ కు రుణాలు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్.. గ్రామీణ విద్యుదీకరణ సంస్థ తాజాగా తన షరతుల్ని మార్చటం సీఎం కేసీఆర్ కు అస్సలు నచ్చలేదు. ఒప్పందం చేసుకునే ముందు చెప్పిన షరతులకు లోబడి మాత్రమే ఉండాలే తప్పించి.. ఒప్పందం అయ్యాక మళ్లీ షరతులు మార్చటం ఏమిటి? అన్న ప్రశ్నను సంధిస్తున్నట్లు చెబుతున్నారు.

ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్వహించిన భేటీలో కీలక అంశాల్ని చర్చించటంతో పాటు.. తాజాగా పెడుతున్న మెలికపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. అలా అని.. వారిని కాదని తాను చేసేదేమీ లేదన్న విషయం ఆయనకు తెలుసు.

ఈ కారణంతోనే ఆయన ఢిల్లీకి రావాల్సి వచ్చిందంటున్నారు. అంతేకాదు.. ఒప్పందం చివర్లో కొత్త షరతులు పెడుతున్న రుణ సంస్థల నిర్ణయం నేపత్యంలో.. ఏమేం చేయాలన్న అంశంపై సలహాలు.. సూచనల్ని సీనియర్ అధికారుల నుంచి ఆయన వినటంతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయగలదన్న దానిపైనా కసరత్తు చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం కేసీఆర్ దూరం పెరిగిన తర్వాత.. రోజువారీగా కేంద్రంపైనా ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. ఆయన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కానీ విరుచుకుపడటం తెలిసిందే. ఘాటు విమర్శలు సంధించటంతో పాటు.. ఇతర రాష్ట్రాల్లోని మంత్రులు వేలెత్తి చూపించని ఎన్నో అంశాల్ని కేటీఆర్ చూపిన వైనం కేంద్రానికి ఆగ్రహానికి గురయ్యేలా చేసిందంటున్నారు. కేంద్రం తీరు నేపథ్యంలో అధికారులతో భేటీ నిర్వహించి.. రాష్ట్ర వాదనను వినిపించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. సాధ్యం కాకుంటే.. తప్పదన్న పరిస్థితే ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇది చివరి అప్షన్ మాత్రమేనని చెబుతున్నారు.

ఇదంతా చూసినప్పుడు.. తనకు హైదరాబాద్ లో ఎదురైన వరుస అనుభవాల నేపథ్యంలో.. ప్రగతి భవన్.. ఫార్మర్ హౌస్ ను దాటి బయటకు రాని సీఎం కేసీఆర్ ను.. తనదైన శైలిలో పావులు కదపటం ద్వారా.. తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి.. ఢిల్లీలో చర్చలు పెట్టేలా చేశారన్న మాట వినిపిస్తోంది. రుణ సంస్థల నుంచి అందే సాయంలో తేడా వస్తే.. తెలంగాణ డెవలప్ మెంట్ కు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులు కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే.. అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరారని చెప్పాలి. ఇదంతా చూస్తే.. ఢిల్లీకి కేసీఆర్ వెళ్లారనే దాని కంటే.. వెళ్లటం వెనుక మోడీ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News