బెదిరింపులను పూనావాలా ముందే ఊహించారా? అందుకే అంత ఖర్చుకు వెనుకాడలేదాఝ

Update: 2021-05-03 02:30 GMT
కొన్ని వారాల క్రితం ఒక వార్త అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. కోవీషీల్డ్ తయారీ సంస్థ సీరం సంస్థ సీఈవో ఆదార్ పూనావాలా లండన్ లోని ఒక విలాసవంతమైన భవంతిని వారానికి రూ.2 కోట్ల భారీ మొత్తానికి అద్దెకు తీసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. వ్యాక్సిన్ ఉత్పత్తి నేపథ్యంలో బిజీబిజీగా ఉండే ఆయన లండన్ లోఇంటిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్న సందేహాలు పలువురు వ్యక్తం చేశాయి. అయితే.. రానున్న రోజుల్లో తనకు ఎదురయ్యే పరిస్థితుల్ని ఆదార్ పూనావాలా ముందే ఊహించారా? అంటే అవునని చెప్పాలి.

ఎప్పుడు వెళ్లారో కానీ లండన్ వెళ్లిపోయిన ఆయన ది టైమ్స్ మీడియా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీకా కోసం భారత్ లోని పలువురు ముఖ్యమంత్రులు తనపై బెదిరింపులకు దిగుతున్నట్లుగా చెప్పి సంచలనంగా మారారు. అంతేకాదు.. ఇప్పట్లో భారత్ లోకి వెళ్లే ఆలోచనలు లేవన్న రీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. అంతేనా.. తమ టీకాల్ని బ్రిటన్ తో పాటు పలు దేశాల్లో ఉత్పత్తి చేస్తామన్న వ్యాఖ్యలు చూస్తే.. ఆయన ఇప్పట్లో భారత్ కు తిరిగి రారన్నమాట వినిపిస్తోంది.

తనకు ఎదురయ్యే పరిస్థితుల గురించి ముందే అంచనాకు వచ్చిన ఆయన.. కొద్ది నెలల క్రితమే లండన్ లోని అత్యంత సంపన్నులు నివసించే ప్రాంతంలో నివాసాన్ని లీజుకు తీసుకున్నారు. మేఫెయిర్ ప్రాంతంలో సీక్రెట్ గార్డెన్స్ లో ఈ విలాసవంతమైన భవంతి ఉందని చెబుతారు. ఇందులో నివాసం ఉన్న  వారికి మాత్రమే ప్రవేశం ఉంటుందని.. కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని చెబుతారు. వారానికి 69వేల డాలర్లు ఇచ్చేలా పోలెండ్ కు చెందిన బిలియనీర్ డొమినికా కుల్క్ జిక్ తో అగ్రిమెంట్ చేసుకున్నారు. పాతిక వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన ఈ ఇంట్లో  పూనావాలా ఉండనున్నారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో భారత్ లో టీకాలకు పెరిగే డిమాండ్.. ఈ సందర్భంగా తనపై వచ్చే ఒత్తిళ్లను గుర్తించిన ఆదర్ వాలా భారత్ నుంచి లండన్ కు షిఫ్ట్ అయినట్లుగా కనిపిస్తోంది. చూస్తుంటే.. ఇప్పట్లోఆయన భారత్ కు తిరిగి వచ్చే అవకాశం లేదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News