వైఎస్ జ‌గ‌న్ ను ఆ ఐఏఎస్ అధికారి త‌ప్పుదోవ ప‌ట్టించారా?

Update: 2022-07-12 06:40 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ జ‌గ‌న్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి (సీఎస్) గా ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం ఉన్నారు. మొద‌ట్లో సీఎం, సీఎస్ మ‌ధ్య చ‌క్క‌టి సంబంధాలే ఉన్నాయి. ఆ త‌ర్వాత సీఎం జ‌గ‌న్ చెప్పే ప్ర‌తి నిర్ణ‌యాన్ని సీఎస్ ఎల్వీ వ్య‌తిరేకించార‌ని.. దీంతో ఆయ‌న‌ను బాప‌ట్ల‌లోని మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి సంస్థ జ‌న‌ర‌ల్ డైరెక్ట‌ర్ బ‌దిలీపై పంపార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అందులోనూ సీఎం జ‌గ‌న్ ఎల్వీకి ఒక్క మాట కూడా చెప్ప‌కుండా.. ఎల్వీ కంటే చాలా జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి అయిన ప్ర‌వీణ్ ప్ర‌కాష్ చేత బ‌దిలీ ఆదేశాలు ఇప్పించార‌ని ఎల్వీ మ‌న‌స్తాపానికి గుర‌యిన‌ట్లు మీడియా క‌థ‌నాలు అప్ప‌ట్లో పేర్కొన్నాయి.

అయితే ఆయ‌న ఆ ప‌ద‌విని తీసుకోకుండా దీర్ఘ‌కాలిక సెల‌వుపై వెళ్లిపోయారు.. ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం. ఈ నేప‌థ్యంలో తాజాగా ఒక టీవీ చానెల్ కు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంట‌ర్వ్యూలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఎంవో (ముఖ్య‌మంత్రి కార్యాల‌యం)లో ఒక జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ను త‌ప్పుదోవ ప‌ట్టించాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అయితే ఎల్వీ.. పేరు చెప్ప‌కుండా జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి అని సంబోధించిన‌ప్ప‌టికీ.. ఎల్వీ చెప్పింది.. ప్ర‌వీణ్ ప్ర‌కాష్ గురించేన‌ని అంటున్నారు.

జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి సీనియ‌ర్ల‌ను కాద‌ని.. సీనియ‌ర్లు తీసుకునే నిర్ణ‌యాల‌ను తోసిరాజ‌ని ఆయ‌న సొంత నిర్ణ‌యాలు తీసుకునేవాడ‌ని ఎల్వీ సుబ్ర‌హ్మ‌ణ్యం హాట్ కామెంట్స్ చేశారు. జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి త‌న పై అధికారి కింద ప‌నిచేయాల్సి ఉంద‌న్నారు. అలా చేయ‌కుండా ప‌రిధి దాటి వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో తాను సీఎస్ గా అత‌డికి నోటీసు జారీ చేశాన‌ని ఎల్వీ తెలిపారు. అంతేకాకుండా సీఎం వైఎస్ జ‌గ‌న్ ను అనేక అంశాల్లో త‌ప్పుదోవ ప‌ట్టిస్తుండ‌టంతో ఆ జూనియ‌ర్ ఐఏఎస్ అధికారిని మంద‌లించాన‌ని ఎల్వీ ఆ ఇంట‌ర్వ్యూలో చేప్పారు.

అలాగే ఇతర శాఖ‌ల్లో జోక్యం చేసుకోవ‌డం, ఆ శాఖ‌ల అధికారుల‌పై జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి పెత్త‌నం చేయ‌డం చేశాడ‌ని వెల్ల‌డించారు. దీంతో ఆ శాఖ‌ల అధికారుల‌కు సీఎస్ గా ఉన్న త‌న‌కు ఫిర్యాదులు చేశార‌ని ఎల్వీ తెలిపారు.

మ‌రోవైపు రాష్ట్ర ప్ర‌భుత్వంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయని, రాష్ట్రపతి తరహా పాలనలోకి ప్రవేశిస్తోందని ఆ జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి తనతో చెప్పారని ఎల్వీ సుబ్రహ్మణ్యం అంటున్నారు.

అంతేకాకుండా ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ముఖ్యం కాదు.. ముఖ్య‌మంత్రే త‌న‌కు ముఖ్య‌మ‌ని ఆ జూనియ‌ర్ ఐఏఎస్ అధికారి త‌న‌తో అన్నార‌ని ఎల్వీ చెప్పారు. అంతేకాకుండా ప‌రిపాల‌న‌పై అత‌డు వ‌ర్చువ‌ల్ గా క్లాసు కూడా తీసుకున్నాడ‌ని వెల్ల‌డించారు.

ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్య‌మంత్రే అంతిమ‌మైన‌ప్ప‌టికీ.. ఆయ‌న కూడా వ్య‌వ‌స్థ ప్ర‌కార‌మే వెళ్లాల్సి ఉంటుంద‌ని, ఇందుకోసం వ్య‌వ‌స్థ‌లో అనుస‌రించాల్సిన విధానాలు ఉన్నాయ‌ని ఎల్వీ చెబుతున్నారు.

ఏదైనా ప్రతిపాదనపై మంత్రి లేదా ముఖ్యమంత్రి నుంచి నోట్ ఫైల్ ఉండాలని తాను గ‌ట్టిగా చెప్పాన‌ని ఎల్వీ వివ‌రించారు. కేబినెట్ సమావేశానికి ముందు తెచ్చిన ఫైళ్లలో కూడా ముఖ్యమంత్రి నుండి వచ్చిన ప్రతిపాదనలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ఉండ‌వు. మంత్రులకు ఫైళ్లు అధ్యయనం చేసే సమయం లేదని ఎల్వీ విచారం వ్య‌క్తం చేశారు.

నోట్ ఫైళ్లు రాయడంపై మంత్రులకు ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటానని తొలి కేబినెట్ సమావేశంలో జగన్ ముందు ప్రతిపాదన పెట్టగ అది సీనియర్లను అవమానించడమేనని ముఖ్యమంత్రి జ‌గ‌న్ దానిని తిరస్కరించారని సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు.
Tags:    

Similar News