సంక్రాంతి ఎఫెక్ట్ : ఎగిరెగిరిపడుతున్న విమానం
ఏకంగా ఒక్క టికెట్ 18 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల దాకా ఫ్యాన్సీ రేటు పలుకుతోంది.
దూరాలు భారాలుగా మరింత దూరాలుగా మార్చే ఏకైక పండుగ బహుశా సంక్రాంతి అని చెప్పాలేమో. మామూలు వేళలలో ఇంత శ్రమ ఖర్చు ఉండవని కూడా అనుకోవాల్సి ఉంది. తెలుగు వారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. దాంతో ఎక్కడెక్కడి నుంచో జనాలు తమ సొంత ఊళ్లకు వెళ్ళాలని చూస్తారు. దాంతో ప్రయాణం అత్యంత ఖరీదుగా మారిపోతుంది. డిమాండ్ అండ్ సప్లై విధానంలో నడిచే ప్రైవేట్ ఆపరేటింగ్ వ్యవస్థలో సంక్రాంతి సీజన్ దాదాపుగా ఏడాది గ్రాసాన్ని అందిస్తుందని కూడా అంటున్నరు.
ఇదంతా ఎందుకు అంటే హైదరాబాద్ నుంచి విశాఖకు వచ్చే విమానం ధరలు ఇపుడు ఎగిరెగిరిపడుతున్నాయి. ఏకంగా ఒక్క టికెట్ 18 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల దాకా ఫ్యాన్సీ రేటు పలుకుతోంది. మామూలు వేళలలో ఉండే ధరల కంటే కూడా మూడు రెట్లు పెంచేసి జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి.
ఎటూ ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు ప్రతీ సారీ సంక్రాంతిని క్యాష్ చేసుకుంటూ ఉంటారు. అధిక రేట్లు పెంచేస్తూ ఉంటారు. ఈసారి ప్రైవేట్ బస్సులలో హైదరాబాద్ టూ విశాఖకు ఆరు వేల దాకా ధర పెట్టేశారు. అంటే విమానం టికెట్ అన్న మాట. మరి విమానానికి రెక్కలు వస్తాయి కదా అందుకే వారు మూడు రెట్లు పెంచేసి తాము ఎవరికీ అందమని ఆకాశానికి ఎగబాకేశారు.
దీంతో ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సంక్రాంతి సంతోషాన్ని ఈ విధంగా అభాసు చేయడం న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు. పెద్ద పండుగ కోసం తాము ఎంతో కష్టపడి వస్తామని సరసమైన ధరలకు ప్రయాణం ఉండాలని కోరుకుంటామని అలా కాకపోయినా ఆకాశానికి ఎగబాకేసేలా ఈ రేట్లు ఏమిటి అని వాపోతున్నారు.
మామూలు వేళలలో స్పెషల్ ఆఫర్లు పెడుతూ విమానం ప్రయాణ ధరలను తగ్గించే వారు ఈ సమయంలో ఆ పని చేస్తే మేలు కదా అని అంటున్నారు. అయితే ముందే చెప్పుకున్నట్లుగా ఇది డిమాండ్ తో కూడిన వ్యవహారం. అందుకే రేట్లు కూడా తారస్థాయికి చేరుకుంటాయి.
ఎక్కడైనా గిరాకీ ఉన్నపుడే కదా మజా. ఇపుడు కూడా అదే సూత్రం వర్తిస్తోంది. మూడు నెలల ముందు నుంచి రైళ్ళకు రిజర్వ్ చేయించుకున్నా వెయింటింగ్ లిస్ట్ వస్తోంది. బస్సులు చాలినన్ని లేవు, ప్రైవేట్ బస్సులలో కుక్కేసి మరీ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. విమానాల ధరలు అయితే ఒక్క లెక్కన మోత మోగించేస్తున్నాయి. ఇక సంక్రాంతి సరదా ముందుగానే తీరిపోయింది కదా అని అంటూ సగటు జనాలు నిట్టూరుస్తున్నారు.