‘దేశం’ ఆక్రమణలన్నింటినీ ఆ సీనియర్ నేతే బయటపెట్టారా?

Update: 2020-11-22 09:10 GMT
ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి  తెలుగుదేశంపార్టీ నేతలు చేసిన ఆక్రమణలన్నీ ఇపుడు బయటపడుతున్నాయా ?  అందుకే  ప్రభుత్వం టార్గెట్ చేసి ఏరి కోరి మరీ కూల్చేస్తోందా ? ఈ ప్రశ్నలకన్నీ అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014-19 మధ్య ఉత్తరాంధ్రలో ప్రత్యేకించి విశాఖపట్నం జిల్లాలో వేలాది ఎకరాలు  కబ్జాలు జరిగాయి. విశాఖపట్నం నగరానికి ఆనుకుని లేదా దగ్గరలోనే ఉన్న ఉన్న భీమిలి, గాజువాక, పెందుర్తి ప్రాంతాల్లో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వేలాది ఎకరాలను కొందరు టీడీపీ సీనియర్ నేతలు ఆక్రమించేసుకున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే వచ్చిన హుద్ హుద్ తుపానును అడ్డం పెట్టుకుని రెవిన్యు రికార్డలు గల్లంతయ్యాయనే సాకుతో రికార్డులను తారుమారు చేసేశారు. ప్రభుత్వ భూములకు యజమానులను కొత్తగా పుట్టించారు. ఇది కాకుండా మరికొన్ని వందలాది ఎకరాలను ఏదో పేరుతో లీజుకు తీసుకోవటం దానికి అదనంగా మరికొన్ని ఎకరాలను కబ్జా చేయటం..ఇలా వేలాది ఎకరాలు టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అధికారంలో ఉన్న కారణంగా ఐదేళ్ళు కొందరు దేశం నేతలు తమిష్టారాజ్యంగా చెలరేగిపోయారు.

సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మొదట్లో కొంత కాలం వదిలేసినా ఆ తర్వాత నుండి కబ్జాలపై దృష్టి పెట్టింది. ముందుగా మాజీ మేయర్, మాజీ ఎంపి టీడీపీ సీనియర్ నేత సబ్బంహరి కబ్జాలను కూల్చేసింది. ఆ తర్వాత గీతం విద్యాసంస్ధల యాజమాన్యం కబ్జాలను కూల్చేసి మళ్ళీ సొంతం చేసేసుకుంది. తాజాగా భీమిలీ బీచ్ రోడ్డులోని గో కార్డింగ్ నడుపుతున్న యజమాని చేసిన కబ్జాను ప్రభుత్వం కూల్చేసింది. మధ్యలో మరో సీనియర్ నేత కొడుకు నిర్వహిస్తున్న రిసార్ట్స్ లో బాగంగా ఆక్రమించిన ప్రభుత్వ భూమిని కబ్జా నుండి విడిపించుకున్నది.

కబ్జాల నుండి తన భూమిని ప్రభుత్వం విడిపించుకోవటం వెనుక టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎలాగంటే టీడీపీ అధికారంలో ఉన్నపుడే జిల్లాలో జరిగిన కబ్జాలు, ఏ నేత అనచురులు ఎంతెంత భూమిని కబ్జా చేశారు? కబ్జా చేసిన భూమిని ఏ ఏ అవసరాలకు వాడుకుంటున్నారు ? ప్రభుత్వం నుండి అడ్డదారుల్లో పొందిన లీజులు తదితరాలన్నింటినీ చింతకాయల ప్రభుత్వానికి పూర్తి ఆధారాలతో సహా అందించారని సమాచారం. టీడీపీ ప్రభుత్వంలోనే మంత్రిగా పనిచేసిన చింతకాయల ఎందుకిలా చేశారు ?

ఎందుకంటే అప్పట్లో చింతకాయలకు ప్రధాన ప్రత్యర్ధి సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్న విషయం అందరికీ తెలిసిందే. కబ్జాల్లో ఎక్కువభాగం గంటా అనుచరులే చేశారన్న మంటతో వాళ్ళ బండారాన్నంతా అప్పట్లో చింతకాయల ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. చింతకాయల ఎన్ని ఆధారాలు చూపించినా, ఫిర్యాదులు చేసినా అప్పట్లో ఏమీ జరగలేదు. అయితే ప్రభుత్వం మారగానే అప్పట్లో చింతకాయల ఇచ్చిన ఆధారాలు, ఫిర్యాదులను బయటకు తీసి వాటిపై దృష్టి పెట్టిందట.  

అప్పట్లో చింతకాయల  అందించిన ఆధారాలను జిల్లా రెవిన్యు అధికారులకు ఇచ్చి జరిపించిన విచారణలో ఫిర్యాదు పూర్తి వాస్తవమే అని తేలిందట. దాంతో ఒక్కో కబ్జాను రెవిన్యు అధికారులు టార్గెట్ చేసి మరీ కూల్చేసి మళ్ళీ సొంతం చేసేసుకుంటున్నారు. తాము చేసిన కబ్జాలు ఏమిటో టీడీపీ నేతలకు బాగా తెలుసు. అందుకనే ఎవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరిప్పలేకపోతున్నారు. ఎంతసేపు తమకు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ప్రభుత్వం కూల్చేస్తోందని గోల చేస్తున్నారే కానీ  సదరు నిర్మాణాలన్నీ తమ భూముల్లోనే ఉన్నాయని ఎవరు చెప్పటం లేదు. అంటే అప్పట్లో చింతకాయల చేసిన ఫిర్యాదులే ఇపుడు కబ్జాల తొలగింపులకు ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతున్నాయని అర్ధమైపోయింది.
Tags:    

Similar News