తెలంగాణ తెచ్చిన విద్యావంతులే ఇలా చేశారా?

Update: 2021-03-24 14:30 GMT
‘‘ఏ నినాదం వెనుక, ఎవరి ప్ర‌యోజ‌నం దాగుందో తెలుసుకోలేనంత కాలం.. ప్ర‌జ‌లు మోస‌పోతూనే ఉంటారు.’’ అన్నాడో మహానుభావుడు. స‌హ‌జంగా అక్షరజ్ఞానం లేని అమాయ‌కులు రాజ‌కీయాల‌‌ను పూర్తిగా అర్థం చేసుకోలేరు. నాయ‌కులు, పార్టీలు మాట్లాడే మాట‌ల అంత‌రార్థాల‌ను వారు ప‌సిగ‌ట్ట‌లేరు. కానీ.. విద్యావంతులు అలా కాదు. చ‌దువుకుని ఉంటారు కాబ‌ట్టి.. పార్టీలు, వాటి ప్ర‌తినిధులు చేసే వ్యాఖ్యానాలు ఏ కోణంలోంచి వస్తున్నాయి? వ్యక్తిగత ప్రాపకం కోసమా? పార్టీల అధికారం కోసమా? ప్రజాక్షేమం కోసమా? అనే విష‌యాలు కాస్తబుర్రపెట్టినా అర్థమవుతాయి. కానీ.. వారు కూడా ఇందుకు సిద్ధంగా లేర‌ని, నిర‌క్ష‌రాస్యుల‌కూ వీరీకి తేడా స‌ర్టిఫికెట్లు మాత్ర‌మే త‌ప్ప‌, ఆలోచ‌న‌ల్లో కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది..!

తెలంగాణ‌లో జ‌రిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వచ్చిన ఫలితాలను ప‌రిశీలిస్తే ఇదే విష‌యం అర్థ‌మ‌వుతోంద‌ని అంటున్నారు మేధావులు. సాధార‌ణ ఓట‌ర్ల‌కన్నా భిన్నమైన ఆలోచ‌న‌ను, దృక్ప‌థాన్ని  విద్యావంతుల నుంచి ఆశించ‌డం కూడా త‌ప్పేన‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌ధానంగా వ‌రంగ‌ల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం నియోజ‌క‌వర్గానికి జ‌రిగిన పోలింగ్ లో టీజేఎస్ నేత కోదండ‌రామ్ ను మూడో స్థానానికి ప‌రిమితం చేయ‌డంప‌ట్ల స‌ర్వ‌త్రా ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. అదే స‌మ‌యంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఆలోచ‌నా విధానాన్ని ప్ర‌స్పుటం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కోదండ‌రామ్ పాత్ర ఏంట‌నేది క‌నీస ఆలోచ‌న చేసిన ప్ర‌తిఒక్క‌రికీ క‌నిపిస్తుంది. రాజ‌కీయ కార‌ణాలు ఏవైనాగా కావొచ్చు.. ఉవ్వెత్తున ఎగ‌సిన తెలంగాణ ఉద్య‌మ కాడిని 2011లో కొంత‌కాలం టీఆర్ఎస్ తాత్కాలికంగా పక్కన బెట్టింది. అప్పుడు రాజకీయ జేఏసీ చైర్మ‌న్ గా అన్నీతానై వ్య‌వ‌హ‌రించి, ఉద్య‌మానికి అంతులేని ఉత్తేజాన్నిచారు కోదండ‌రామ్‌. తెలంగాణ ఉద్య‌మ చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలిచిపోయిన ‘మిలియ‌న్ మార్చ్‌’ను తన సారధ్యంలో విజయవంతం చేసి, తెలంగాణ ఆకాంక్షను ఢిల్లీకి వినిపించారు. క్రిడెట్ త‌న‌కు మాత్ర‌మే ద‌క్కాల‌న్న కార‌ణంతో కేసీఆర్ ఈ కార్య‌క్రమానికి దూరంగా ఉన్నార‌ని అప్ప‌ట్లో విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత కాలంలో టీఆర్ఎస్ యాక్టివ్ కావ‌డం.. స‌క‌ల‌జ‌నులంతా రోడ్ల‌పైకి రావ‌డం తెలంగాణ సాధించ‌డం జ‌రిగిపోయింది. అయితే.. ఉద్య‌మంలో ఉన్న ప్ర‌ముఖుల్లో చాలా మంది ఆ త‌ర్వాత గులాబీ కండువా క‌ప్పుకున్నారు. కానీ.. కోదండ‌రామ్ మాత్రం అంగీక‌రించ‌లేదు. ఎందుకోస‌మైతే తెలంగాణ వ‌చ్చిందో.. దానికోసం పోరాటం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. నీళ్లు, నిధులు, నియామ‌కాల పోరాటంలో తాను ప్ర‌జ‌ల ప‌క్ష‌మే ఉంటాన‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ జ‌న‌స‌మితిని కూడా ప్రారంభించారు.

ఇలాంటి కోదండ‌రామ్ ను ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మూడో స్థానానికి ప‌రిమితం చేశారు విద్యావంతులు! దీనికి గ‌ల కార‌ణాలను విశ్లేషిస్తే.. ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన స‌మాధానాలు క‌నిపిస్తున్నాయి. దీర్ఘ‌కాలిక పోరాటాల‌కు, ఎదురు చూపుల‌కు ఉన్న‌త విద్యావంతులు, ప‌ట్ట‌భ‌ద్రులు కూడా సిద్ధంగా లేర‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌మ‌కు ల‌భించే అతి స్వ‌ల్ప ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌కు వారు మొగ్గుచూపుతున్నార‌ని తేట‌తెల్లం అవుతోంది. అంతేకాదు.. ఆలోచించ‌డం వ‌దిలేసి, ప్ర‌చారాల రొద‌లో ప‌డిపోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. సోష‌ల్ మీడియా హోరులో కొట్టుకుపోతున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌భుత్వ తీరును ఎండ‌గట్టే క్ర‌మంలో నాలుగు ఎమోష‌న‌ల్ మాట‌లు మాట్లాడేవారి వైపు అట్రాక్ట్ అవుతున్నార‌ని, ఆచితూచి. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించే వారిని ప‌ట్టించుకోవ‌ట్ల‌ద‌ని తేలిపోయింది. ఈ ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు రెండో స్థానం, కోదండ‌రామ్ కు మూడో స్థానం ద‌క్క‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి ఆలోచ‌నా విధానంతో ఉన్న యువ‌త.. సామ‌,దాన,బేద, దండోపాయాల్లో దేనికో ఒక‌దానికి ప‌డిపోతున్నార‌ని అంటున్నారు. ఇందులో డ‌బ్బుల‌కు అమ్ముడుపోయే వారే ఎక్కువ‌గా ఉన్నార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌య్యేవారి విష‌యంలోనే కాదు.. పెద్ద‌ల స‌భ‌గా పేరున్న‌ మండ‌లిలోనూ ఇదే తీర్పు కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. ఈ లెక్క‌న నిర‌క్ష‌ర్యాసుల‌కు, విద్యావంతుల‌కు ఎలాంటి తేడా లేద‌ని, వీరి నుంచి కూడా భిన్నంగా ఆశించ‌డం కూడా పొర‌పాటేన‌ని ఈ ఎమ్మెల్సీ ఫలితాలు రుజువు చేస్తున్నాయని అంటున్నారు మేధావులు.


Tags:    

Similar News