రంగా వర్థంతిని ఎవరు చేయాలో కొడాలి టీం డిసైడ్ చేసుడా?

Update: 2022-12-26 10:17 GMT
గుడివాడ లాంటి ఊళ్లో.. కత్తులు.. కర్రలు పట్టుకొని నడి రోడ్డు మీద విరుచుకుపడటం.. ఏ మాత్రం అవకాశం చిక్కినా.. ఏం చేసేందుకైనా సిద్ధమన్నట్లుగా బరితెగింపు అంతా ఒక ఎత్తు అయితే.. ఒకవేళ వైసీపీకి చెందిన వారు అవసరం లేకున్నా చెలరేగిపోతుంటే నియంత్రించాల్సిన పోలీసులు నిస్తేజంగా ఉండిపోవటం దేనికి నిదర్శనం? తెలుగు ప్రాంతం రెండు రాష్ట్రాలుగా విడిపోయి.. ఎవరి బతుకు వారు బతుకుతున్న వేళ.. కొందరి ప్రముఖుల వర్థంతులు.. జయంతుల్ని తామే చేయాలని.. తాము మాత్రమే నిర్వహించాలన్న పట్టుదలకు వెళ్లటం దేనికి నిదర్శనం?

ఇదంతా ఒక ఎత్తు అయితే.. పెట్రోల్ పాకెట్లను ప్రత్యర్తుల వైపు విసిరేసి.. పగిలిన పెట్రోల్ పాకెట్లకు నిప్పు రాజేయటం ద్వారా దారుణమైన స్కెచ్ వేసుకున్నట్లుగా పలువురు అభివర్ణిస్తున్నారు. ఏం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ పెట్రోల్ పాకెట్లు పగిలిన తర్వాత నిప్పు రాజుకొని ఉండి ఉంటే పరిస్థితులు ఎంత భయానకంగా ఉంటాయో అంచనాకు సైతం అందనిదిగా చెప్పాలి.

ఈ ఉదంతాన్ని రాజకీయమో.. రాజకీయ గొడవలుగా చూసే కన్నా.. ఇదో ప్రమాదకర పరిణామంగా చెప్పాలి. అన్నింటికి మించి పోలీసులు ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని విపరిణామాల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికాపక్షానికి విధేయులుగా ఉండే దరిద్రపు గొట్టు విధానం అంతకంతకూ ముదిరిపోవటం సమాజానికి ఏ మాత్రం క్షేమం కాదు.

ఇవాళ ఒక పార్టీ అధికారంలో ఉండొచ్చు. రేపు మరో పార్టీ ఉండొచ్చు. ఎవరు పవర్లో ఉంటే వారి పక్షాన పోలీసులు నిలిచే ధోరణి.. రానున్న రోజుల్లో పరిస్థితులు మరింత విషమంగా మారటమే కాదు.. విచ్చలవిడితనానికి నిదర్శనంగా మారుతుంది.

అప్పుడు మొత్తం బాధ్యత పోలీసులదే అవుతుంది. ప్రమాదకర పరిణామాల విషయంలో అధికార.. విపక్షం అన్న తేడా లేకుండా తప్పు చేసిన వారికి చుక్కలు చూపించే తీరును పోలీసులు మరిచిపోతున్న కొద్దీ.. హింస తన హద్దుల్ని దాటేస్తుంది. అందరూచూస్తుండగానే.. పెట్రోల్ పాకెట్లు తమ ప్రత్యర్థుల పైకి విసిరేసి.. నిప్పు పెట్టే వరకు విషయం వెళ్లిందంటే.. మరికాస్త అవకాశం ఇస్తే మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో? ఇది గుడివాడకే కాదు.. ఏపీ రాజకీయానికి.. ప్రజలకు ప్రమాదమన్నది గుర్తించాల్సిన అవసరం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News