ప‌వ‌న్ గేమ్ ప్లాన్ ఫెయిల్ అయ్యిందా..?

Update: 2021-09-30 08:32 GMT
డౌట్ 1: సినిమా టికెట్ల రేట్ల పెంపు వ్య‌వ‌హారాన్ని త‌న రాజ‌కీయ ప‌య‌నానికి అనుగుణంగా వాడుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ భావించాడా?

అతి త్వ‌ర‌లో సినిమా టికెట్ల రేట్ల పెంపుకు అనుగుణంగా ఏపీ ప్ర‌భుత్వం జీవోను తీసుకురానున్న నేప‌థ్యంలో, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆఖ‌రి నిమిషంలో స్పందించిన మాటైతే వాస్త‌వం. ప‌వ‌న్ రిప‌బ్లిక్ ప్ర‌సంగానికి ముందు ఇండ‌స్ట్రీ వ్య‌క్తులు వెళ్లి మంత్రి పేర్ని నానిని క‌లిసిశారు. వారి నుంచి ప‌వ‌న్ కు క‌నీస స‌మాచారం అయితే అంది ఉండ‌వ‌చ్చు. ఎందుకంటే దిల్ రాజు అక్క‌డే ఉన్నాడు. ఆయ‌న కూడా మంత్రితో స‌మావేశం అయిన సినీ పెద్ద‌ల్లో ఒక‌రు. ఎలాగూ జీవో రానున్న నేప‌థ్యంలో.. హ‌డావుడి చేస్తే త‌న‌కు భ‌య‌ప‌డి జ‌గ‌న్ ప్ర‌భుత్వం జీవో ఇచ్చింద‌నే ప్ర‌చారం అయితే ఒక‌టి ప‌వ‌న్ వైపు నుంచి వ‌చ్చేది. క‌నీసం ఆన్ లైన్ మీడియాలో ప‌వ‌న్ ఫ్యాన్స్ అలా ప్ర‌చారం చేసుకునే వాళ్లు!

డౌట్ 2: ఆన్ లైన్ పోర్ట‌ల్ తో ప‌వ‌న్ సానుభూతి పొందే ప్ర‌య‌త్నం చేశాడా?

సినిమా ఇండ‌స్ట్రీ, థియేట‌ర్ల‌కు సంబంధించి అవ‌క‌త‌వ‌క‌ల‌ను అరిక‌ట్ట‌డానికి పోర్ట‌ల్ అని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం సినిమాల వ‌సూళ్ల‌కు సంబంధించిన ప‌న్నుల‌న్నీ స్లాబ్ సిస్ట‌మ్ ఆధారంగానే వ‌సూల‌వుతున్నాయి. టికెట్ల అమ్మ‌కం మీదే సినిమా డిస్ట్రిబ్యూట‌ర్లు, నిర్మాత‌లు ప‌న్ను క‌డుతున్నారు. ఇలాంటి నేప‌థ్యంలో పోర్ట‌ల్ ద్వారా టికెట్ల లెక్క‌లు ప‌క్కాగా తేలితేనే ప్ర‌భుత్వానికి క‌చ్చిత‌మైన ప‌న్నులు వ‌సూల‌య్యేది! కాబ‌ట్టి పోర్ట‌ల్ ఆలోచ‌న‌ను ప్ర‌భుత్వం ఎలాగైనా స‌మ‌ర్థించుకుంటుంది. అయితే పోర్ట‌ల్ తెస్తున్న‌ది త‌న‌పై క‌క్ష‌తోనే అని ప‌వ‌న్ ప్ర‌చారం చేసుకున్నాడు! ఇలా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న‌పై క‌క్ష సాధింపుకు పాల్ప‌డుతోంద‌నే సందేశాన్ని డైరెక్టుగా ఇచ్చాడు. అయితే ఈ ప్ర‌చారం కూడా ప‌వ‌న్ కు క‌లిసివ‌చ్చేలా లేదు!

ఫ్యాక్ట్ 1: ప‌వ‌న్ ను లైట్ తీసుకున్న ఇండ‌స్ట్రీ!

ఏపీ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించి తీసుకుంటున్న నిర్ణ‌యాల‌న్నీ త‌న‌పై క‌క్ష సాధింపే అని ప‌వ‌న్ చేయాల‌కున్న ప్ర‌చారాన్ని సినిమా ఇండ‌స్ట్రీ లైట్ తీసుకుంది. టికెట్ల రేట్లు పెర‌గాల‌నేది అంద‌రి కోరికా, అంద‌రి లాగా ప‌వ‌న్. అలాగే.. పోర్ట‌ల్ ను ఇండ‌స్ట్రీ వ్య‌తిరేకించ‌లేదు. వెళ్లేది మంత్రితో చ‌ర్చ‌ల‌కు. అలాంట‌ప్పుడు పోర్ట‌ల్ వ‌ద్దు అని వాదిస్తే, మోసాల‌కు ఆస్కారం ఇవ్వ‌మ‌న్న‌ట్టుగా అవుతుంది. టికెట్లు రేట్లు పెంచితే చాలు, పోర్ట‌ల్ పెట్టినా ఫ‌ర్వాలేద‌ని ఇండ‌స్ట్రీ భావిస్తోంది. ఇలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ వాద‌న‌కు వ‌త్తాసు పలికితే.. ప్ర‌భుత్వం స‌ర్లే చూద్దాం అనొచ్చు! అప్పుడు ప‌వ‌న్ కు పోయేదేమీ లేదు. అయితే వ్యాపారం చేసుకునే వాళ్ల‌కే న‌ష్టం. అందుకే ప‌వ‌న్ ను లైట్ తీసుకుంది ఇండ‌స్ట్రీ. త‌మ‌కు సినిమా టికెట్ల ధ‌ర‌ల‌ను పెంచండి చాలు, ప‌వ‌న్ మాట‌ల‌ను కానీ, ప‌వ‌న్ ను కానీ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని మంత్రికి విన్న‌వించుకున్నారు సినీ ఇండ‌స్ట్రీ పెద్ద‌లు! టికెట్ల రేట్ల క‌న్నా ప‌వ‌న్ క‌ల్యాణ్ వీళ్ల‌కు ఎక్కువ అనిపించ‌లేదు!

ఫ్యాక్ట్ 2: ప‌వ‌న్ గేమ్ ప్లాన్ ఫెయిల్!

సినిమా ఇండ‌స్ట్రీ అంటే త‌నే, త‌ను అంటే ఇండ‌స్ట్రీ అన్న‌ట్టుగా రిప‌బ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగించారు. త‌న‌పై క‌క్ష అని డైరెక్టుగా అన్నారు. ఇదంతా రాజ‌కీయ త‌ర‌హా ప్ర‌సంగ‌మే. అందులో సందేహం లేదు. ప‌వ‌న్ ఎన్ని చెప్పినా.. ఆయ‌న కూడా ఒక రాజ‌కీయ నేతే. కాబ‌ట్టి.. త‌నే సెంట‌ర్ అన్న‌ట్టుగా క‌ల‌రింగ్ ఇచ్చి త‌న‌పై ఏదో జ‌రుగుతోంద‌నే ఊపును తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఇండ‌స్ట్రీ పెద్ద‌లు రెండోసారి మంత్రి వ‌ద్ద‌కు వెళ్ల‌డం, వారిని ప‌క్క‌నే కూర్చోబెట్టుకుని ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మంత్రి తీవ్రంగా విమ‌ర్శించ‌డం, దానికి సినిమా వాళ్లే సాక్ష్యంగా నిల‌వ‌డం, ప‌వ‌న్ అన్న చిరంజీవి కూడా ఆయ‌నను స‌మ‌ర్థించ‌డం లేద‌ని మంత్రి ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వ‌డం... ఇవ‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగాయి. అంతిమంగా టీ క‌ప్పులో తుఫాన్ లాంటి ఈ వ్య‌వ‌హారం కొన్నాళ్ల పాటు నాని ఉంటే ప‌వ‌న్ కు కావాల్సినంత ప్ర‌చారం ద‌క్కేది. అయితే.. సినీ నిర్మాత‌లు వేగంగా స్పందించ‌డంతో, ఇది టీక‌ప్పులో తుఫాన్ లాగానే ముగిసిన‌ట్టుగా ఉంది.
Tags:    

Similar News